28 March, 2026 | 8:17 PM

కాంగ్రెస్‌ది అరాచక పాలన

16-05-2024 02:25 AM

రాజకీయ కక్షలతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంటిపై దాడి

నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలం 

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం

అచ్చంపేట, మే 15: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తున్నదని, సీఎం రేవంత్‌రెడ్డి అండతోనే అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై దాడికి తెగబడ్డారి నాగర్ కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విరుచుకుపడ్డారు. బుదవారం అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షలతోనే బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో, కర్రలతో దాడి చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల నుంచి బాల రాజు కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

దాడులు జరుపుతున్న సమయంలోనే పోలీసులు అక్కడే ఉన్నారని, అయినా స్పందించలేదని ఆరోపించారు. దాడి చేసిన నిందితులు పరారీలో ఉన్నారని చెప్పడం దారుణమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిందితులు ఎవరో తెలిసిపోతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలకు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి గాయపడిన వారిని పరామర్శించారు.