పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే

28-04-2024 12:10:00 AM

మెదక్ కాంగ్రెస్ ఎంపీఅభ్యర్థి నీలం మధు

దుబ్బాక నియోజకవర్గంలో విస్తృత ప్రచారం

సిద్దిపేట, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): పేదలకు భూములు, ఇండ్లు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు స్పష్టంచేశారు. శనివారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, అక్బర్‌పేట, భూంపల్లి ఎక్స్‌రోడ్ మండలాల్లో ఆయన దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌ఛార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఆయా మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీసంఖ్యలో బైక్ ర్యాలీతో నీలంమధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని, అన్నీ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ద్వారానే మేలు జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజానీకానికి ఒకరగబెట్టిందేమీ లేదన్నారు.

ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. దేశం లో, రాష్ట్రంలో ఉద్యోగాలిస్తామని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఓట్లు దండుకుని యువతను, ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రాష్ట్ర, దేశీయ కంపెనీలతో మాట్లాడి ప్రతి ఆరు నెలలకోసారి యువతకు జాబ్‌మేళా నిర్వహిస్తానని ప్రకటించారు. దుబ్బాకలో నిర్వహించిన ముదిరాజ్ సభ సంఘం ఆత్మీయ సభలో నీలం మధు పాల్గొన్నారు. 

ముదిరాజ్ సంఘం మహాసభ రాష్ట్ర నేత చొప్పరి శ్రీనివాస్ నేతృత్వంలో ముదిరాజ్‌లంతా నీలంమధుకు తమ మద్దతు తెలి పారు. మిరుదొడ్డిలో బీఆర్‌ఎస్ మిరుదొడ్డి ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్ రాజలింగారెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింలు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నీలం మధు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.