07-10-2024 01:48:49 AM
త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలను దక్కించునేందుకు ప్లాన్
శాసనమండలిలో బలం పెంచుకునేలా కార్యాచరణ
హైదరాబాద్, అక్టోబర్ ౬ (విజయక్రాంతి): శాసనమండలిలో బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి పదునుపెట్టింది. పెద్దల సభలో ఎమ్మెల్సీల సంఖ్యను పెంచుకోవాలని హస్తం పార్టీ నేతలు యోచిస్తున్నారు. త్వరలో ఖాళీ అయ్యే మూడు స్థానాలను హస్తగతం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు.
శాసనమండలిలో మొత్తం 40 మంది సభ్యులుండగా ఇందులో కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఆరుగురు ఎమ్మెల్సీలు (జీవన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, అమీర్ అలీఖాన్, టీజేఎస్ నుంచి కోదండరాం) ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కూచుకుల్ల దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికిచేరగా, ఇటీవల బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అధికార పార్టీ కండువా కప్పుకున్నారు.
నాలుగు నెలల్లో ఎన్నికల షెడ్యూల్!
వచ్చే ఏడాది మార్చి 29తో రాష్ట్రంలోని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానాలకు చెందిన ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, రఘోత్తమ్‌రెడ్డితో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పదవీకాలం ముగుస్తుంది. ఆయా ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ నమోదు కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
2025, ఫిబ్రవరిలో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికోసం డిసెంబర్ నాటికి ఓటరు జాబితాను ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మూడు ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంటే మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్యాబలం పెరుగుతుందని, తద్వారా మండలిలో బీఆర్‌ఎస్‌ను కట్టడి చేయొచ్చని భావిస్తున్నారు.
సిట్టింగ్ స్థానమైన పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు రెండు ఉపాధ్యాయ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలో దించాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. కరీంనగర్, నిజాబాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉండగానే జగిత్యాల అసెంబ్లీకి, తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ సెగ్మెంట్‌లో పోటీ చేసి ఓడిపోయారు.
దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా మరో అవకాశం లభించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జీవన్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదంటూ చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుబంధ పీఆర్‌టీయూ నుంచి అభ్యర్థిని బరిలో దింపాలా? లేక ఇతర సంఘాలకు మద్దతు ఇవ్వాలా? అనే విషయమై పార్టీలో చర్చ జరుగుతుంది.
పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పని చేస్తున్నారు. ఆయన్ను ఒక నియోజకవర్గం నుంచి బరిలో దింపాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 1.96 లక్షల ఓటర్లు ఉన్నారు.
అదే విధంగా కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 23 వేలమంది, నల్లగొండ టీచర్ నియోజకవర్గంలో 21 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సారి ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య మరింత పెరగనుంది.