కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 76. శ్రీనివాస్ గతంలో ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పనిచేశారు.
డి. శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా ఆయన చేసిన సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు. పార్టీలో తనతో చాలా కాలంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.






