పోలవరానికి తీరని నష్టం
- వైసీపీ ప్రభుత్వ తీరే కారణం
ప్రాజెక్ట్‌పై ఏపీ సర్కారు శ్వేతపత్రం విడుదల
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని ఏపీ సీఎం చంద్రబాబునాయడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై చంద్రబాబు సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ర్ట పునర్నిర్మాణంలో భాగంగా తొలిసారి క్షేత్రస్థాయి పర్యటనగా గత సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏడు శ్వేతపత్రా ల్లో భాగంగా మొదటిది పోలవరం ప్రాజెక్ట్‌పై విడుదల చేశానని చంద్రబాబు తెలిపారు. రానున్న శాసనసభ సమావేశాలలో సంబంధిత అంశాలపై చర్చ జరిపి, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని సీఎం తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టుల అవసరం రాష్ట్రానికి చాలా ఉందన్నారు. 2014- ప్రాజెక్టును ట్రాక్‌లోకి తీసుకురావడానికి తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించి 70 శాతం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 3,000 టీఎంసీల నీటిని కరువు రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దేందుకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 194 టీఎంసీ నీళ్లు నిల్వ చేసుకోవచ్చని, 320 టీఎంసీల వరకు నీరు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుందన్నారు.
28.50 లక్షల జనాభాకు తాగునీరు, 960 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజం, పరిశ్రమలకు సమృద్ధిగా నీరు లభిస్తుందని చెంద్రబాబు తెలిపారు. 2019-2024 మధ్య ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేకుండా పోయిందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పనిచేసే ఏజెన్సీలను తొలగించి పనులు నిలిపివేశారని చంద్రబాబు వివరించారు.
కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగానే...
ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తికరంగానే ఉందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సజావుగా పూర్తి కావాలంటే ముంపుకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఏపీలో విలీ నం అవ్వడం ఒక గొప్ప పరిణామం అని సిఎం అన్నారు. 2018లో డయాఫ్రం వాల్ 436 కోట్ల రూపాయల్తో పూర్తి చేస్తే, ఇప్పుడు డామేజ్ అయిన డయాఫ్రం వాల్ మరమ్మత్తులకు రూ. 447 కోట్లు ఖర్చు అవుతుంద న్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ సీపేజ్ వల్ల డ్యామ్ పై ఏ రకమైన పని చేయాడానికి వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయని, సీపే జి అరికట్టడానికి అయ్యే ఖర్చు, సమయం ఎంతో అనేది కూడా అంచానాలకు చిక్కడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు.
పోలవరం ప్రాజెక్టులోని తప్పిదాలను నీతి ఆయోగ్ నవంబర్ 2021 లోనే ఎత్తిచూపిందని అన్నారు. గత ప్రభుత్వానికి కేంద్రం నిధులు ఇచ్చినా ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టకుండా రూ.3,385.58 కోట్లు దారి మళ్లించి పోలవరాన్ని ముంచిందని, నిర్వాసితులను దగా చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో కూడా చెప్పలేమని అన్నారు. ఏజెన్సీని మార్చకుండా ప్రాజెక్ట్ ప్లాన్నింగ్ సక్రమంగా అమలై ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యి హైడల్ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరిగేది, 960 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి దక్కేదన్నారు. ఈ జాప్యంతో జల విద్యుత్ లభించక రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు.
కాపర్ డ్యామ్ నుంచి డయాఫ్రం వాల్ వరకు, గైడ్ బండ్ నుంచి సీపేజ్ వరకు అన్ని చోట్లా సమస్యల పరిష్కారం తరువాతే ప్రధాన పనులు చేపట్టవల్సిన పరిస్థితి నేడు నెలకొందన్నారు. అంతర్జాతీయ నిపుణులు, దేశీయ ఐఐటీ నిపుణులు, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ సవాలును అధిగమిస్తామ న్నారు. పోలవరం ప్రాజెక్టులో అసాధారణ జాప్యం జరిగింది అనేది మాత్రం వాస్తవం అని పాత్రికేయులకు సీఎం తెలిపారు.






