16 April, 2026 | 2:01 AM

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత జావిద్ మృతి

16-04-2026 12:35 AM
  1. కన్నీటిపర్వంతమైన కాంగ్రెస్ టీమ్..

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, తుమ్మల 

ఖమ్మం, ఏప్రిల్ 15(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర కమిటీ మాజీ అధ్యక్షుడు, పిసిసి సభ్యులు మొహమ్మద్ జావిద్ బుధవారం సూర్యాపేట జిల్లా పిల్లల మర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాలు మృతి చెందారు. తన కారులో హైదరాబాద్ కు వెళ్తున్న జావీద్ డివైడర్ను ఢీ కొట్టి రోడ్డు కిందికి దూసుకెళ్ళడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో డ్రైవింగ్ స్థానంలో ఉన్న జావీద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సూర్యాపేట జిల్లా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

శోకసంద్రంలో జిల్లా కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పదేళ్లపాటు ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన మహమ్మద్ జావిద్ అకాల మరణంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ శోఖసంద్రంలో మునిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అనేక రకాలుగా తన శాయశక్తుల పనిచేసిన జావేద్ రోడ్డు ప్రమాదాల మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు జావిద్ నివాసానికి చేరుకుంటున్నారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు 

మహ్మద్ జావిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే రాందాసు నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, మాజీ అధ్యక్షుడు ఫువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గిడ్డంగుల శాఖ చైర్మన్ రాయల నాగేశ్వరరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు. మరణ వార్త తెలిసిన వెంటనే ఉన్నపలంగా పర్యటనలు మొత్తం రద్దు చేసుకొని జావిద్ నివాసానికి వచ్చి నివాళ్ళు అర్పించారు.