24 June, 2026 | 12:30 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

15న కామారెడ్డిలో కాంగ్రెస్ సభ

06-09-2025 01:56 AM

-బీసీ డిక్లరేషన్ ప్రకారం బిల్లు చేశాం 

-పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని ఏడాది

-ఈ రెండు సందర్భాల నేపథ్యంలోనే సభ

-కోటా తేల్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం

-ధనం, ఆధిపత్యం కోసమే కేసీఆర్ కుటుంబంలో పంచాయితీ 

-మీడియాతో చిట్‌చాట్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

ఒక బీసీ నేతను ముఖ్యమంత్రిగా చూడాలనుంది..అయినప్పటికీ రెండోసారీ రేవంత్‌రెడ్డినే సీఎం 

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ‘అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. డిక్లరేషన్ అమ లులో భాగంగా బీసీలకు విద్య, ఉద్యో గ అవకాశాల కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేశాం.  అలాగే ఈ నెల 15వ తేదీతో నేను పీసీ సీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తవుతున్నది.

ఈ రెండు సందర్భాలకు గుర్తుగా బీసీ డిక్లరేషన్ ప్రకటిం చిన కామారెడ్డిలోనే ఈ నెల 15న భారీ సభ నిర్వహిస్తున్నాం’ అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. ఏడాది కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనకు ఎంతో సహకరించారని, వారందరినీ కలుపుకొంటూ ముందుకు వెళ్తున్నానని వివరించారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఒక బీసీ నేతనే సీఎం అవుతారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డినే ఐదేళ్లు పూర్తిగా సీఎంగా ఉంటారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనే మేం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాం.

రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే’ అని పీసీసీ చీఫ్ తేల్చిచెప్పారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీపడటం లేదని, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నదని, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీలో కొంత గందరగోళం నెలకొన్నదనే విషయాన్ని ఆయన అంగీకరించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరులకు మొదటి నుంచీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటని పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్ అంశంపై పీసీసీ చీఫ్ మరోసారి స్పష్టతనిస్తూ.. బీసీ కోటా సంగతి తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఉద్ఘాటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామని, గవరర్నర్ ఆమోదం కోసం బిల్లును గవర్నర్ వద్దకు పంపించామని గుర్తుచేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నుంచి పార్టీ మారినందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వం పోతుందా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘నేను అలా అనుకోవడం లేదు’ అని పీసీసీ చీఫ్ సమాధానమిచ్చారు.

పార్టీని మరింతబలోపేతం చేస్తాం..

కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పీసీసీ చీఫ్ వెల్లడించారు. దీనిలో భాగంగానే త్వరలోనే పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలు ప్రకటించబోతున్నామని వివరించారు. స్థానిక సంస్థల కంటే ముందే  నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఏఐసీసీ నుంచి సీనియర్ నాయకులు పరిశీలకులుగా వస్తారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే నమ్మకం వచ్చిందని, అందుకే అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారని అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్ కోటా కింద చట్టసభలో అవకాశం ఇవ్వాలనే అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చామని తేల్చిచెప్పారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కూడా గాంధీభవన్‌కు వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఆక్టోబర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కార్యకర్తలకు బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో డీసీసీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించనున్నారని పేర్కొన్నారు. తనకు కులమంటే అభిమానం ఉంది తప్ప, కులపిచ్చి లేదని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ విచారణను పక్కదారి పట్టించేందుకే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం డ్రామా చేస్తున్నదని కొట్టిపడేవారు. ప్రజలను పక్కదారి పట్టించే అలవాటు మొదటి నుంచి ఆ కుటుంబానికి ఉందని దుయ్యబట్టారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సంతోశ్‌రావు ఎంత దోచుకున్నారో జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రపంచానికి చెప్పి మంచి పని చేశారని కితాబునిచ్చారు. సంతోశ్‌రావు వల్లనే సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్లకు చెందిన దళిత బాధితులు క్షోభ అనుభవించారనేది, కవిత ఘటన సంభవించినప్పుడే వెల్లడించి ఉంటే, ఆమె గౌరవం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఒక్క కవితనే కాదు.. ఎవరిపై అవినీతి మరకలున్నా.. కాంగ్రెస్ పార్టీ వారిని చేర్చుకోదు’ అని తేల్చిచెప్పారు.

ధనం, అధిపత్య పోరు సమస్యతో కవిత, కేటీఆర్ మధ్య పంచాయితీ నడుస్తున్నదని అభిప్రాయపడ్డారు. బీసీ బిడ్డల నోటిదాక వచ్చిన ముద్దను తినకుండా చేసింది కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌నే అని ఆరోపించారు. ‘ఒకే విమానంలో రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు వెళ్లినంతా మాత్రాన కలిసిపోయినట్లు కాదు’ అని పీసీసీ చీఫ్ తెలిపారు. కాళేశ్వరం కేసులో రాష్ట్రప్రభుత్వం ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటే, అది కక్షతోనే చేశామంటారనే తాము ఆ కేసును సీబీఐకి అప్పగించామని కుండ బద్దలు కొట్టారు.