కాంగ్రెస్ x బీజేపీ
- మంత్రి కోమటిరెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత
- వినాయకుడి వద్ద ప్రత్యేక పూజల్లో..అభివృద్ధి కార్యక్రమాల ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు
-దేవుడి వద్ద రాజకీయాలు వద్దని అభ్యంతరం
-కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠాత్మక ఒకటో నెంబర్ వినాయక విగ్రహం వద్ద శుక్రవారం నగర ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆయన ప్రసంగానికి బీజేపీ నాయకులు అడ్డుతగిలారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజకీయాలేంటని ప్రశ్నించారు. దీం తో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకొని ఘర్షణ వాతావరణం నెలకొంది.
వెంటనే తేరుకున్న పోలీసులు ఇరువర్గాలను నిలువరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని కనగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులను బీజేపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు సైతం తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, భగవంతుడి వద్ద రాజకీయాలు చేయడం సరికా దని హితవు పలికారు. బీజేపీ నేతలను అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఊరుకొనే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
వర్షిత్‌రెడ్డి విడుదలకు కంచర్ల డిమాండ్
ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పోలీసులు అదుపులో తీసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. వర్షిత్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ విగ్రహం వద్ద బైటాయించారు. వర్షిత్‌రెడ్డిని విడుదల చేసే వరకు నిమజ్జన యాత్ర ప్రారంభించేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. అరెస్ట్ విషయంలో ఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొద్ది సమయం తర్వాత నాగం వర్షిత్‌రెడ్డిని పోలీసులు విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ బందోబస్తు నడమ మధ్య శోభాయాత్ర కొనసాగింది.






