calender_icon.png 16 October, 2024 | 12:57 AM

మదర్ డెయిరీలో కాంగ్రెస్ ప్యానల్ విజయం

14-09-2024 01:01:59 AM

ఆరు డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నింటిలో గెలుపు

యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు 13 (విజయక్రాంతి)/ఎల్బీనగర్: ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర స్వయం సహకార యూనియన్ (మదర్ డెయిరీ) పాలకవర్గ డైరెక్టర్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ప్యానల్ ఘన విజయం సాధించింది. 15 మంది పాలకవర్గ సభ్యులు ఉన్న మదర్ డెయిరీలో ప్రతియేటా ముగ్గురు డైరెక్టర్లు పదవీ విరమణ పొందుతారు. అయితే, ప్రత్యేక కారణాలతో గత ఏడాది ఎన్నికలు జరగకపోవడంతో ఈ ఏడాది ఆరుగురు డైరెక్టర్ల పదవులకు శుక్రవారం హయత్ నగర్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో పోలింగ్ నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన రెండు ప్యానళ్ల నుంచి 12 మంది అభ్యర్థులు పోటీ పడగా, కాంగ్రెస్ ప్యానల్‌కు చెందిన ఆరుగురూ విజయం సాధించారు. గుడిపాటి మధుసూదన్ రెడ్డి 229 ఓట్లు, కల్లెపల్లి శ్రీశైలం 222, పుప్పాల నర్సింహులు 181, బత్తుల నరేందర్‌రెడ్డి 177, రుద్రాల నర్సింహారెడ్డి 242, మండలి జంగయ్య 237 ఓట్లు సాధించి విజయం సాధించారు. బీఆర్‌ఎస్ ప్యానల్ నుంచి పోటీ చేసిన మారెడ్డి కొండల్ రెడ్డికి 112, సందిల్ల భాస్కర్‌కు 104, డీ సోమిరెడ్డికి 76, ఒగ్గు భిక్షపతికి 71, ఎడ్ల రామిరెడ్డికి 68, పీ గణేష్‌కు 34 ఓట్లు వచ్చాయి. గెలుపొందిన డైరెక్టర్లను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అభినందించారు.