25-12-2025 04:07:47 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని గుంజపడుగు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం బుధవారం హైదరాబాద్ లోని చారిత్రక ప్రాంతాలు గోల్కొండ కోట, చార్మినార్, బిర్లా సైన్స్ మ్యూజియం, నెహ్రూ జూ పార్క్ మొదలైనవి విజ్ఞాన విహార యాత్రలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా గోల్కొండ, చార్మినార్ లకు సంబంధిత చరిత్ర ప్రభావాలను తెలుసుకుని అబ్బుర పడ్డారు. జూపార్క్ లోని జంతువులకు, పక్షులను సందర్శించి వాటి జీవన విధానాలను తెలుసుకున్నారు.
బిర్లా సైన్స్ మ్యూజియం లోని సైన్స్ ఎగ్జిబిట్లను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను తెలుసుకున్నారు. బిర్లా సైన్స్ మ్యూజియం లో డైరోసార్ నిజ అస్థిపంజరం, వృక్ష శిలాజాలను సందర్శించి సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. ఇలాంటి విజ్ఞాన విహార యాత్రల ద్వారా విద్యార్థులకు వినోదం తో పాటు విజ్ఞానం చేకూరుతుందని ఉపాధ్యాయులు అన్నారు. ఆనందంగా అభ్యసించడం ద్వారా నేర్చుకున్న విషయాలు జీవితాంతం గుర్తుంటాయని, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మంథని మండల విద్యాధికారి దాసరి లక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శివలీల, కర్రు సురేష్, కాసిపేట భూమయ్య, వడ్లకొండ స్వామి, రవీందర్,దాసరి నరేందర్, మూడెత్తుల సమ్మయ్య, సుప్రజ లు పాల్గొన్నారు.