calender_icon.png 16 February, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హంగ్’ నుంచి హస్త గతం?

16-02-2026 01:41:43 AM

కేసముద్రం, జనగామ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా!

ఎక్స్‌అఫిషియో ఓట్ల కోసం ఎంపీ, ఎమ్మెల్యేల దరఖాస్తు 

మహబూబాబాద్/జనగామ, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కేసముద్రం, జనగామ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఆయా మున్సిపాలిటీ ల్లో చైర్మన్ పదవిని హస్తగతం చేసుకోవడానికి ఎక్స్‌అఫిషియో ఓటు హక్కును వినియో గించడానికి చర్యలు చేపట్టింది. 16 వార్డులు ఉన్న కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, బీఆర్‌ఎస్ 8 స్థానాల్లో కౌన్సిలర్ పదవులను దక్కించుకున్నాయి. ఇక్కడ మహబూ బాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా శనివారం దరఖాస్తు చేసుకున్నారు.

దీంతో కాంగ్రెస్ బలం తొమ్మిదికి చేరనుంది. ఇదే విధంగా జనగామలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (బీఆర్‌ఎస్) ఎక్స్ అషిషియో ఓట్ల కో సం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇక్కడ స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థుల ఓట్లు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో కీలకం కానున్నాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎక్స్‌అఫిషియో ఓటు హక్కు కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దరఖాస్తు చేసుకోవడంతో అక్కడ కూడా హంగ్ నుంచి కాంగ్రెస్ బయటపడే అవకాశాలు మెరుగయ్యాయి.

మహ బూబాబాద్‌లో మ్యాజిక్ ఫిగర్‌కు కొంత దూ రంలో ఉన్న కాంగ్రెస్‌ను గట్టెక్కించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ ఎక్స్ అఫిషియో ఓటు అస్త్రాన్ని వినియోగించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ తక్కల్ల పల్లి రవీందర్‌రావు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటు వేయడానికి ఎక్స ఫిషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నా రు. ఇక్కడ ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపడం, సీపీఎం సభ్యుల మద్దతు తో కాంగ్రెస్ చైర్మన్ పదవి దక్కించుకునే అవకాశాలు మెరుగుపడ్డాయంటున్నారు.

తొర్రూరులో 

తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 9 బీఆర్‌ఎస్, 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీఆర్‌ఎస్ దక్కించుకుంటుందని అంతా అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎక్స్ అఫిషియో ఓట్ల కోసం పాల కుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్ ఎం పీ కడియం కావ్య ఇక్కడ దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పుడు ఇరు పార్టీల బలం సమం అయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. 

తొర్రూరు పీఠం బీఆర్‌ఎస్‌దే: ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇచ్చినప్పటికీ, దొడ్డి దారిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని, తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఫిరాయిస్తున్నారని తప్పు డు ప్రచారం చేస్తున్నారని, ఎవరు ఎన్ని చేసినా, పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తొర్రూరు మున్సిపాలిటీ పీఠంపై బీఆర్‌ఎస్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికవ్వడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని తొర్రూరు పట్టణ ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన 9 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లతో కలిసి వీడియో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకుండా హంగ్ ఏర్పడ్డప్పుడే ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకుంటారని, ఇప్పుడు ఇక్కడ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సోమవారం జరిగే తొర్రూ రు మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించడం తద్యమన్నారు.