కాంగ్రెస్ పాలన గాడితప్పుతోంది
భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పుతోందని, ఆ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోరారు. గురువారం కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం అధికారం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై సరైన అవగాహన లేకపోవడంతో పూటకో మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. వడ్లకు రూ.500 బోనస్ విషయంలో మాటమార్చారని మండిపడ్డారు. ప్రతి గింజనూ కొంటామని గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హరీశ్‌రావు చెప్పేవారని.. ఇప్పుడు అవే మాటలను మంత్రి భట్టి విక్రమార్క రికార్డు వినిపిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిస్తే ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించగలరా అని అన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఆరోపించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ పార్టీలు రెండు నాణేనికి బొమ్మాబొరుసు వంటివని ఆరోపించారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాలో చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్, నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, రమేశ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






