కళ్లు చెదిరే కరీం‘నగల్’!
అంబానీకి నచ్చిన ఆభరణాలు
అపర కుబేరుడు మెచ్చిన సిల్వర్ ఫిలిగ్రీ
కరీంనగర్‌కే సొంతమైన కళావైభవం!
ముఖేశ్ అంబానీ కుమారుడి పెళ్లిలో అతిథులను అలరించనున్న గిఫ్ట్
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ మనసును కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు దోచాయి. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం జూలైలో జరగనుండగా ఈ వివాహానికి హాజరయ్యే అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల చేతిలో రూపు దిద్దుకున్న కళాఖండాలను బహుమతులుగా అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి కరీంనగర్ నుంచి 40 వస్తువులను తెప్పించుకొని అతిథులకు అందించారు. వివాహ వేడుకలో హాజరయ్యే అతిథులకు బహుమతులు అందించనున్న వివిధ రూపాల్లోని 700 కళాఖండాలు
కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి.
కరీంనగర్, మే 23 (విజయక్రాంతి): కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం నవాబుల హయాంలో మొదలై క్రమక్రమంగా ఖండాంతరాలకు పాకింది. ఈ కళ కరీంనగర్‌కు సొంతమవుతుంది. దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యత వహించింది. కరీంనగర్ సమీపంలోని ఎలగందుల గ్రామంలో వెండి నగిషీ కళాకారులు ఈ కళను చాటారు. వీరు కరీంనగర్‌కు వచ్చి ఈ వృత్థిలోనే స్థిరపడి నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అబ్బురపడే విధంగా వెండి నగిషీ కళాఖండాలను తయారు చేస్తున్నారు.
భారతదేశానికి వచ్చిన ఏ విదేశీ అతిథికైనా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసి కళాఖండాన్ని జ్ఞాపికగా అందించడం ఆనవాయితీగా వస్తుంది. చంద్రబాబు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఈ కళారూపాలను చూసి ప్రశంసలు అందించారు. ఈ కళాకారుల చేతిలో చార్మినార్, తాజ్‌మహల్, ఎర్రకోట, వీణ, మయూరం, దేవుళ్ల ఆకృతులు, ప్రముఖ స్థలాలను సిల్వర్ ఫిలిగ్రీ ద్వారా సుందరంగా రూపొందిస్తుంటారు.
పెద్ద పెద్ద కళారూపాల నుంచి తాళం చెవి, సిగరేట్ యాష్ మొదలు చెవుల కమ్మల వరకు అనేక రకాల తక్కువ ధరలకే దొరికే జ్ఞాపికలను తయారు చేస్తున్నారు. ఇటీవల జరిగిన జి20 దేశాల సదస్సులో కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు తయారు చేసిన లోగో బటన్‌ను అతిథులకు మోదీ అందించారు. అక్కడ ఫిలిగ్రీ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం విశేషం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులకు సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన వీణ, చార్మినార్‌లను బహుమతిగా ఇచ్చారు.
మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చిన ప్రధాని మోదీకి, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టిన సందర్భంలో అతిథులుగా వచ్చిన అప్పటి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలకు సిల్వర్ ఫిలిగ్రీ జ్ఞాపికను కేసీఆర్ బహుమతిగా అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు ముద్దుల కూతురు ఇవాంక ట్రంపుకు కూడా ఈ ఫిలిగ్రీని గిఫ్టుగా అందజేశారు. నేడు అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహానికి దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలను బహుమతులుగా అందించనుండడం ద్వారా కరీంగర్ ఖ్యాతి మరో మారు ప్రపంచానికి కళాకారులు చాటనున్నారు.
పూర్తిగా వెండితోనే..
పూర్తిగా వెండి తీగతో తయారు చేసే ఫిలిగ్రీ వస్తువులకు దేశ విదేశాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. ఒకప్పుడు పూర్తిగా ఈ వృత్తిపై జీవించినవాళ్లంతా వృద్ధాప్యంలోకి రావడంతో మొత్తం వారి వారసులు, యువత సిల్వర్ ఫిలిగ్రీ వస్తువుల తయారీని నేర్చుకుని ముందుకు సాగుతున్నారు. కొంతమంది కళాకారులు కలిసి ‘సిఫ్కా’ను ఏర్పాటు చేసుకున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీగా నామకరణం చేసుకొని ఈ ఫిలిగ్రీ పూర్వ వైభవం తీసుకురావడానికి ముందుకు నడుస్తున్నారు.
అపురూప కళాఖండాలకు కరీంనగర్ పుట్టినిల్లు..
దారం నమూనాలో ఉండే వెండి, బంగారు తీగలతో గృహోపకరణాలను తయారు చేసే పద్ధతినే సిల్వర్ ఫిలిగ్రీ అంటారు. సామాన్యంగా జనం వాడుకలో ఉండే ప్లేట్లు, చెవిరింగులు, మెడను అలంకరించే ఆభరణాలు, గిన్నెలు, కీచైన్స్, చెంచాలు లాంటివి ఈ ఫిలిగ్రీ కళలో రూపొందిస్తారు. సుమారు 400 ఏళ్ల కిందట ఒకప్పటి జిల్లా కేంద్రం ఎలగందులలో ఈ కళ పురుడు పోసుకుంది. కడార్ల పనయ్య(మునయ్య) అనే స్వర్ణకారుడు ఈ కళకు ఆద్యుడు. 1905లో జిల్లా కేంద్రం కరీంగర్‌కు చేరుకున్న ఇతని వారసులు ఇప్పటికీ ఈ కళను కాపాడుతూ వస్తున్నారు. వెండి తీగతో అపురూప కళాఖండాలను సృష్టించే ఈ కళకు కరీంనగర్ జిల్లా పుట్టినిల్లుగా నిలుస్తుంది.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత ముందుకు
ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కళను నమ్ముకున్న వృత్తిదారులను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రస్తుతం 200 మంది కళాకారులు సిల్వర్ ఫిలిగ్రీ వస్తువుల తయారీలో నిమగ్నమయ్యారు. మాకు వస్తున్న ఆర్డర్లనుబట్టి నెలకు 25 వేల రూపాయల మేర ఒక్కొక్కరికి ఉపాధి కల్పిస్తున్నాం.
ఈ కళాఖండం పేటెంట్లను కరీంనగర్ కళాకారులం అయిన మేము పొంది ఉన్నందున విశ్వవ్యాప్తంగా వీటి అమ్మకాలను ప్రోత్సహిస్తే చాలామంది ఇక్కడి స్వర్ణకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇప్పటికే మా కళా ఖండాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు ముందుకు వస్తే మేము ముందుండి మరికొంత మంది కళాకారులను తీర్చిదిద్దుతాం. కఠోర శ్రమతో ఈ వస్తువులను తయారు చేయాల్సి ఉంటుంది. కనుక శిక్షణ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ప్రస్తుతం మేం మా దగ్గరకు వచ్చే వారికి శిక్షణ ఇస్తున్నాం.
గడ్డి అశోక్, సిఫ్కా ప్రధాన కార్యదర్శి






