17 August, 2026 | 7:06 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలముంటదో తెలీదు

24-05-2024 01:24 AM

సూర్యాపేట, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ఎంతకాలం అధికారంలో ఉంటుందో కూడా తెలియదని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా గురువారం సూర్యాపేటలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో సమాధానం చెప్పాలన్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న రకాలకు అంటూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కనీసం పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని, ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.

ఆరు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయింది

-బీజేపీ సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్