ఎన్నికల హామీలు నెరవేర్చిన తర్వాతే కాంగ్రెస్ ఓట్లు అడగాలి

21-04-2024 01:25:12 AM

l బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆమె స్వగృహంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మయమాటలు చెప్పి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గాలి మాటలు చెప్తున్నదని మండిపడ్డారు.

తనను మహిళ అని చూడకుండా కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఐదుసార్లు మహబూబ్‌నగర్ వచ్చారన్నారు. తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు. తమది రైతు కుటుంబమని, పేదల కోసం పోరాటం చేసిన చరిత్ర తమ కుటుంబానికి ఉందని గుర్తుచేశారు. ఆగస్టు 15 లోపు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని సీఎం ప్రకటించారని, అమలు చేయని పక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించి, మరోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు జి.పద్మజారెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, క్రిష్టియానాయక్, అంజయ్య, కౌన్సిలర్లు  పాల్గొన్నారు.