20 May, 2026 | 1:29 PM

మనఊరు మంగళం

21-04-2024 01:24 AM

డబ్బులు ఇవ్వకుంటే స్కూళ్లకు తాళాలు వేస్తామంటున్న కాంట్రాక్టులు 

జిల్లాలో రూ. 10.32 కోట్లు బకాయిలు 

రెండు దశాబ్దాల తరువాత ఎస్‌ఎంసీ వ్యవస్థ రద్దు 

కొత్తగా ఏర్పడిన ఆదర్శ మహిళా కమిటీల చేతుల్లోకి ప్రభుత్వ పాఠశాలలు

వికారాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : మనఊరుమనబడి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడినట్లే అనిపిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు కార్యక్రమం కొంతమేరా సత్ఫలితాలు ఇచ్చినా, అప్పటి ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2022లో ఈ కార్యక్రమాన్ని దశల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించారు. అయితే రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమం ఊసేత్తడం లేదు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తన మార్కు చూపించుకునేందుకు ఆదర్శ మహిళ కమిటీలను తీసుకొచ్చి పాఠశాలల అభివృద్ధి పనుల నిర్వాహణ, సమస్యల పరిష్కారం బాధ్యతను మహిళా సంఘాల చేతికి అప్పగించింది. దీంతో మనఊరు ఇప్పటికే పూర్తయిన పనులపై, రావాల్సిన నిధులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం పాఠశాలల్లో చేసిన పనులకు కనీసం బకాయి డబ్బులైనా చెల్లిస్తుందా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. 

371 పాఠశాలలు ఎంపిక

వికారాబాద్ జిల్లాలో మొదటి విడతలో భాగంగా 371పాఠశాలలను ఎంపిక చేశారు. ఎంపికైన పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించేందుకు రూ. 70.63కోట్లు ఖర్చు అవుతున్నదని అధికారులు అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఇందులో రూ. 7లక్షల నుంచి రూ. 30లక్షలలోపు అంచనా ఉన్న వాటిని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. ఇలా పనులు చేపట్టిన వాటిలో జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 30పాఠశాలల్లోనే వందశాతం పనులు పూర్తయ్యాయి. మరో 181 పాఠశాలల్లో 80శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. మరో 160పాఠశాలల్లో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. అయితే 80శాతం పనులు పూర్తయిన పాఠశాలలకు ప్రభుత్వం అరకోర నిధులు మాత్రమే ఇచ్చింది. సొంత డబ్బులు పెట్టి పనులు చేయించిన ఎస్‌ఎంసీ చైర్మన్లు, సర్పంచ్‌లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇంతకి మనఊరు కొనసాగుతందా, పూర్తయిన పనులకు డబ్బులు వస్తాయా.. రావా అనే ఆందోళనలో కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారులు కూడా స్పష్టమైన హామీ ఇవ్వడంలేదు. 

రూ. 10.32కోట్లు పెండింగ్ బిల్లులు

     మనఊరు కింద చేపట్టిన పనులకు సంబంధించి జిల్లాలో రూ. 10.32 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బులు చెల్లిస్తేగానే మిగత పనులు పూర్తి చేయలేమని కాంట్రాక్టర్లు తెలిపారు. ప్రభుత్వం కార్యక్రమం కొనసాగిస్తుందా లేదా అనే విషయం పక్కనబెడితే తాము చేసిన పనులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మనఊరుెేమనబడి కింద చేపట్టిన పనులకు ఎంత బకాయిలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇటీవల ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్లు జూన్ 1న పాఠశాలల పుఃనప్రారంభం రోజు తాళాలు వేస్తామని హెచ్చరిస్తున్నారు. 

ఆదర్శ మహిళ కమిటీలు రావడంతో..

రెండు దశాబ్దాల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఎస్‌సీ కమిటీ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా ఆదర్శ మహిళా కమిటీలను తీసుక్చొంది. గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఈ కమిటీలో ఉంటూ పాఠశాల అభివృద్ధి పనులు చూసుకోవాలని సూచించింది.  

వడ్డీకి తెచ్చి పని పూర్తి చేశా..

    ఇతరుల వద్ద వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి మనఊరు పనులు చేయించాను. పనులు పూర్తు ఆరు నెలలు గడుస్తుంది. ముందుగా రూ. 7.80 లక్షలు మంజూరు చేశామని పనులు చేయించారు. ఆ తరువాత రూ. 2.50లక్షలు అదనంగా మంజూరు చేస్తున్నామని చెప్పి అదనపు పనులు చేయించుకున్నారు. అధికారులు చెప్పిన పనులన్నీ పూర్తి చేసినా బకాయి డబ్బులు ఇవ్వడం లేదు. రూ. 2.70లక్షలు నాకు రావాలి. జూన్‌లోపు డబ్బులు ఇవ్వకుంటే స్కూల్ తెరిచేనాడు తాళం వేస్తా.

 ముష్టి ప్రభు, మాధారం యూపీఎస్ పాఠశాల కాంట్రాక్టర్



రూ. 21లక్షలు రావాలి   

వికారాబాద్ మండలం పులుమద్ది పాఠశాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద రూ. 32లక్షలు, మనఊరు కింద రూ. 48 లక్షలు, మొత్తం రూ. 80లక్షలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు రూ. 32లక్షల పను లు పూర్తి చేస్తే కేవలం రూ. 11లక్షలు మాత్రమే వచ్చా యి. ఇంకా రూ. 21 లక్షలు రావాలి. మిగత డబ్బులకు ఎంబీ పూర్తి చేశారు, కానీ డబ్బులు ఇవ్వడం లేదు. పను లు పూర్తి చేసిన వాటి బకాయిలు ఇస్తేనే మిగత పనులు పూర్తి చేస్తాం లేదంటే పనులు నిలిపివేస్తాం. 

 మాధవరెడ్డి, పులుమద్ది మాజీ సర్పంచ్


జిల్లాలో మనఊరు మనబడి వివరాలు

మనఊరు ఎంపికైన పాఠశాలలు 371 

వందశాతం పనులు పూర్తయినవి 30 

80శాతం పనులు పూర్తయిన పాఠశాలలు

నిధులు లేక పనుల ప్రారంభానికి నోచుకోని పాఠశాలలు 160  

ఇప్పటి వరకు విడుదలైన నిధులు  రూ.23 కోట్లు 

ఇంకా పెడింగ్‌లో ఉన్న నిధులు  కోట్లు