18-07-2025 01:03:07 AM
నిజామాబాద్, జూలై 17 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీల నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలు ఇచ్చిన ప్రజా ప్రభుత్వం ఇప్పటికీ వాటిని అమలు చేయ డం లేదని, లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం అందడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
లబ్ధిదారులను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటికి తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాలు విసిరారు. గల్ఫ్ బాధితుల విషయంలో మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ‘కనువిప్పు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వేల్పూరుకు వెళ్లేందుకు యత్నించిన మానాల మోహన్‌రెడ్డిని గురువారం పోలీసులు నిజామాబాద్ లోని సుభాష్‌నగర్‌లో అడ్డుకున్నారు.
సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యం లో మోహన్‌రెడ్డికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అప్పటికే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో మాజీ మంత్రి ఇంటి వద్ద సైతం పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్‌రెడ్డితో పాటు కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుడు, కాంగ్రెస్ ప్రతినిధి నంగి దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాం త్‌రెడ్డి ఇంట్లో చొరబడేందుకు యత్నించగా, బీఆర్‌ఎస్ నేతలు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు.
పోలీసులు అడ్డుకొని అతన్ని పోలీస్ జీప్ తరలించారు. కట్టుదిట్టమైన పో లీస్ భద్రత ఉన్నప్పటికీ ఓ కాంగ్రెస్ నాయకుడు గుట్టుచప్పుడు కాకుండా ప్రశాంత్‌రెడ్డి ఇంట్లో చొరబడేందుకు యత్నించడం చర్చనీయాంశమైంది.
ప్రశాంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు: మానాల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ, ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్‌లో నిర్వహించే కనువిప్పు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తు న్న మోహన్‌రెడ్డిని గురువారం పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పదేండ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్‌ఎస్ నా యకులు, అధికారాన్ని కోల్పోవడంతో మతిస్థిమితం తప్పారని ఆరోపించారు. ప్రభుత్వం గల్ఫ్ బాధితులకు అండగా ఉంటుందని, ఇప్పటికే జిల్లాలో 55 మంది గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం సాయం చేసిందని, ప్రశాం త్‌రెడ్డి నియోజకవర్గమైన బాల్కొండలోనూ 18 మంది సాయం పొందారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చకు రాకుండా ప్రశాంత్‌రెడ్డి మొహం చాటేస్తున్నారని ఆరోపించారు. ఇంకోసారి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసినా, కాంగ్రెస్ నాయకుల జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మా ఇంట్లోకి చొరబడటం సరికాదు: మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ఎన్‌ఆర్‌ఐ ఫోరానికి చెందిన నంగి దేవేందర్‌రెడ్డి మా ఇంట్లోకి చొరబడి, కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన వీడియోను విడుదల చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని, అధికార పార్టీ వైఫల్యా లను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ బోర్డు ద్వారా ఏ ఒక్క బాధితుడికి సహాయం అందడం లేదని ఆరోపించారు.
గల్ఫ్‌లో చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ తన నియోజకవర్గంలో లబ్ధి అందని వారు చాలా మంది ఉన్నారని తెలపారు. తన ఇంటిపై దాడి చేసినందుకు మానాల మోహన్‌రెడ్డి కడుపు చల్లబడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపు రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.