08-01-2026 12:00:00 AM
వనపర్తి, జనవరి 6 (విజయక్రాంతి): కృష్ణా నీళ్లు పాలమూరుకు దక్కకుండా కుట్రలు జరిగాయని, క్లారిటీ కోసమే ప్రాజెక్టుల బాట పట్టామని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో జూరాల ప్రాజెక్టును వారు సందర్శించి మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల నుంచి చేపట్టాలని కాంగ్రెస్ కొత్త వాదన తెరమీదకు తీసుకొస్తున్నదని, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఏనాడు ఈ అంశంపై ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారని, ఆంధ్రప్రదేశ్‌కి ప్రాజెక్ట్ ఆగడానికి ఉప్పందించారని విమర్శించారు.
అసెంబ్లీలో వాళ్లకు ఇష్టమొచ్చినట్లు పిపిటి ఇచ్చారన్నారు. పాలమూరు జిల్లా బాగుకోసం నిజాం కాలంలో అనేక ప్రాజెక్టులు చేపడితే ఆ తర్వాత కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదలన్నారు. కాంగ్రెస్ మంత్రులు తల తోక లేకుండా మాట్లాడుతున్నారని, శ్రీశైలం, సాగర్ ఆంధ్రా ప్రయోజనాలు కాపాడటం కోసమే కట్టారని, శ్రీశైలం వద్ద పాలమూరు ప్రాజెక్టు కడితే మూడు సార్లు రిజర్వాయర్ లు నింపుకోవచ్చన్నారు.
68 టీఎంసీ ల నీళ్ళు ఒక్కసారి వస్తే పాలమూరు ముఖచిత్రం మారిపోతుందని ఇది ఇష్టం లేక అడ్డుకుంటూ, ఆంధ్రా నాయకులకు బానిసలుగా మారిన ప్రభుత్వ పెద్దలు విచిత్రంగా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే జూరాల ఎండిపోయిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నీళ్లు ఎట్లా తీసుకుపోతారని వారు ప్రశ్నించారు. జూరాల వద్ద పాలమూరు చేపడితే ఎక్కువ ముంపు ఉండేదని ఆనాడు ఇంజినీర్‌లతో ఆలోచించి ప్రాజెక్ట్ సోర్స్ మార్చినట్టు చెప్పారు. 70 టీఎంసీల నీళ్లు జూరాల నుంచి ఎలా తీసుకెళతాం దీనిపై వాస్తవాలను తెలియజేయడానికి ప్రాజెక్ట్ సందర్శన చేపట్టామన్నారు.
శ్రీశైలం వద్ద ఫిబ్రవరి,మార్చి వరకు నీటిని ఎత్తిపోయచ్చని కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం వృధా అని, ఇప్పటికే మక్తల్‌లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్టు కింద నీళ్లు ఇవ్వొచ్చన్నారు. ప్రస్తుత మంత్రులు, ముఖ్యమంత్రి అవగాహన లేకుండా ఉన్నారని, జిల్లా నుండి ముఖ్యమంత్రి ఉన్నా ఉపయోగం లేదన్నారు.
సీఎం, ఇరిగేషన్ మంత్రి డైలాగ్‌లు చెప్పడం కాదు ప్రాజెక్టు పూర్తి చేయాలని, లేకుంటే జిల్లా ప్రజల తరఫున పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వారివెంట అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్‌మోహన్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, అంజన్న యాదవ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి బాస్ హనుమంత్ నాయుడు, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ఉన్నారు.