07-01-2026 01:04:57 AM
తుంగతుర్తి, జనవరి 6: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లిలో పోలీస్ విచారణలో భాగంగా రైతు జోగునూరి లాజరస్ గుండెపోటుతో సోమవారం మధ్యాహ్నం మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం రాత్రి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా పోలీస్ అధికారులు రంగ ప్రవేశం చేయడం ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు, గ్రామస్థుల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
దీంతో పోలీసులు గ్రామస్థులపై లాఠీఛార్జి చేసినట్లు తెలుస్తున్నది. ఒక వర్గంపై, మరొక వర్గం వారు ఫిర్యాదు చేయగా కేసులు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా దవాఖానాలో తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మంగళవారం పోలీస్ అధికారులు అప్పగించగా.. కుటుంబ సభ్యులు, గ్రామస్థుల నడుమ అంతక్రియలు పూర్తయ్యాయి.
2007లో కేతిరెడ్డి సౌజన్య దేవి కుటుంబం నుంచి 11 ఎకరాలు భూమిని లాజరస్‌కు అమ్మి పట్టా చేశారు. ప్రస్తుతం 2 ఎకరాలు 20 గుంటల భూమిని తుంగతుర్తి తహసీల్దార్‌తో సౌజన్యదేవి అక్రమ పట్టా చేయించుకున్నట్టు తెలుస్తున్నది. జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు విచారణ జరిపి లాజరస్ కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.