11-01-2026 01:19:29 AM
2021లో ఫడ్నవీస్, షిండేను ఓ కేసులో ఇరికించేందుకు పథకం
విశ్రాంత డీజీపీ రష్మీ శుక్లా నివేదికలో వెల్లడి
ముంబై, జనవరి ౧౦: మహారాష్ట్ర మాజీ డీజీపీ సంజయ్ పాండేపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేను 2021లో ఒక తప్పుడు కేసులో ఇరికించేందుకు ఆయన కుట్ర పన్నారని ఒక విచారణ నివేదిక వెల్లడించడం కలకలం రేపింది. విశ్రాంత డీజీపీ రష్మీ శుక్లా తాజాగా ఆ రాష్ట్ర హోంశాఖకు ఈ నివేదికను సమర్పించారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) చట్టం ఉల్లంఘన కేసును ఆధారంగా చేసుకుని ఈ కుట్ర జరిగినట్లు నివేదిక పేర్కొంది. 2021లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంజయ్ పాండే ఈ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది.
అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ఫడ్నవీస్, మంత్రిగా ఉన్న షిండేలను బిల్డర్ల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేయాలని ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. థానే పోలీసు విభాగంలోని కొందరు ఉన్నతాధికారులను సంజయ్ పాండే స్వయంగా ఆదేశించినట్లు నివేదికలో వెల్లడైంది. కుట్రకు సంబంధించి ఒక ఆడియో క్లిప్పింగ్ కూడా బయటకు వచ్చింది. ఫడ్నవీస్‌ను ఎలా ఇరికించాలనే అంశంపై అధికారుల మధ్య జరిగిన సంభాషణలు అందులో ఉన్నట్లు తెలుస్తోంది.
నిందితుల నుంచి బలవంతంగా వాంగ్మూలాలు తీసుకోవాలని పోలీసులు ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. కేసులో అరెస్టున సంజయ్ పునామియా, సునీల్ జైన్ అనే వ్యక్తులపై పోలీసులు ఒత్తిడి తెచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఫడ్నవీస్ ఎంత డబ్బు వసూలు చేశారో చెప్పాలని, లేనిపక్షంలో జైలుకు పంపుతామని వారిని బెదిరించినట్లు సమాచారం. కెమెరా ముందు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వాలని కూడా వారిని బలవంతం చేశారని రష్మీ శుక్లా తన నివేదికలో పేర్కొన్నారు.