కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్ల తొలగింపునకు కుట్ర
పార్టీ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పాలేరు బీఎల్‌ఏల శిక్షణ శిబిరంలో పాల్గొన్న మంత్రి
ఖమ్మం, జూన్ 12 (విజయక్రాంతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
పీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఏల్‌ఏల) అవగాహన శిక్షణ శిబిరం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్డులో గల పీవీఆర్ గారెన్స్‌లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ‘ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిదని, ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని మంత్రి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో.. అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్ ఓట్లు’గా చిత్రీకరించి, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోందన్నారు. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. నిన్నటి వరకు ఓట్లను దొంగిలించిన వాళ్లు.. ఈరోజు ఏకంగా సీట్లనే దొంగిలించే దుస్థితికి కేంద్ర ప్రభుత్వం దిగజారిందన్నారు.
బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలోని ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా వాడుకుంటోందని మంత్రి ఆరోపించారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు బూత్ లెవెల్ అధికారులు నిర్వహించే ‘ఓట్ మ్యాపింగ్’ ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, పీసీసీ ప్రతినిధి సుధాకర్, ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్, ఏదులాపురం మున్సిపల్ చైర్మ న్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.






