13 June, 2026 | 1:15 AM

ముగిసిన ‘99 రోజుల ప్రణాళిక’

13-06-2026 12:05 AM

12,760 గ్రామాలు, 3,288 మున్సిపల్ వార్డుల్లో నిర్వహణ

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం ముగిసింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అన్ని విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వా మ్యంతో నిర్వహించారు. 12,760 గ్రామ పంచాయతీల్లో 12,758 గ్రామ సభలు, 3,288 మున్సిపల్ వార్డుల్లో 3,175 వార్డు సభలు జరిగాయి. మొత్తం 15,76,219 మంది పాల్గొన్నారు.

119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,10,414 మంది, జిల్లా స్థాయిలో 32 జిల్లాల్లో 37,294 మంది పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో 32,451 మంది లబ్ధిదారులకు ఆస్తుల మంజూరు జరిగింది. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా 12,700 గ్రామ పంచాయతీలు, 135 పట్టణ స్థానిక సంస్థల్లో కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 21 లక్షల మంది ఇందులో భాగస్వాములయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,06, 598 పెండింగ్ ప్రభుత్వ ఫైళ్లను పరిష్కరించారు. 4551 టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి క్లీనింగ్ నిర్వహించారు.

12,303 ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. నిమ్స్‌లో  రూ. 30 కోట్ల లినాక్ సదుపాయం, ఎగ్రడ్డ మానసిక ఆరోగ్య సంస్థలో రూ.24 కోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బ్లాక్ ప్రారంభమైంది. 9,275 నిరుద్యోగ యువతను నైపుణ్యాభివృద్ధి కార్యక్ర మాలకు అనుసంధానించారు.

బడి బాట కార్యక్రమం ద్వారా బడి బయట పిల్లల గుర్తింపు, నమోదు కార్యక్రమాలు జరిగాయి. చైల్ సేఫ్టీ, సే నో టు డ్రగ్స్  వారంలో షీ టీమ్స్, ఏహెచ్టీయూ, భరోసా కేంద్రాల ద్వారా 1,702 అవగాహన సదస్సులు నిర్వహించారు. రైతు వారంలో వ్యవసాయం, ఉద్యానవనం, మార్కెటింగ్, సహకార, బ్యాంకులు, పశుసంవర్థక, మత్స్య, సాగునీటి శాఖలు కలిసి కార్యక్రమాలు చేపట్టాయి. యువజన-క్రీడల వారంలో ఫిట్నెస్, నాయకత్వం, ఉపాధి, సాంస్కృతిక చైతన్యంపై రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి.