13 June, 2026 | 1:13 AM

బీజేపీ అంటేనే బీసీల వ్యతిరేకి

13-06-2026 12:08 AM
  1. జన గణలో కులగణన చేసే వరకు పోరాటం 
  2. ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం 
  3. ప్రభుత్వ సలహాదారు వీహెచ్ హెచ్చరిక 
  4. కోఠిలోని జనగణన శాఖ డైరెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): బీజేపీ అంటేనే బీసీల వ్యతిరేక పార్టీ అని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు విమర్శించారు. జాతీయ జనగణనలో బీసీ కులగణన చేపడతామని స్వయానా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించి, మాట తప్పారని అన్నారు. జాతీయ జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ జనగణన శాఖ డైరెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం వీహెచ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్‌తో పాటు కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులు  పాల్గొన్నారు.

ధర్నా అనంతరం జనగణన శాఖ డైరెక్టర్ భారతి హోలీ కేరీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 60 శాతం మంది బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని మండిపడ్డారు. బీసీల లెక్కలు తేలితేనే రాజ్యాధికారం దక్కుతుందన్నారు.

అయితే బీసీలకు రాజ్యాధికారం దక్క వద్దనే కుట్రతోనే బీజేపీ కుల గణన చేయ డం లేదని వీహెచ్ మండిపడ్డారు. జాతీయ జన గణనలో బీస కుల గణన చేపట్టకపోతే బీసీలందరు జనగణనను బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రం లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ము ట్టడి, కేంద్ర మంత్రులను అడ్డుకోవడంతో పాటు ప్రధాని పర్యటనలో తమ నిరసనలు తెలియజేస్తామని స్పష్టం చేశారు.