calender_icon.png 15 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ సవరణే పరిష్కారం

15-01-2026 12:00:00 AM

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేసే వరకు దేశవ్యాప్తంగా పోరాడుతాం

ప్రధాని మోదీ రిజర్వేషన్లు పెంచి బీసీల రుణం తీర్చుకోవాలి 

త్వరలో విజయవాడలో బీసీల మేధో మదన సమావేశం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌రావు 

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ ఒకటే పరిష్కార మార్గమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్‌గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌రావు అన్నారు. రాజ్యాంగ సవరణ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవిఎస్‌ఎన్ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని 11 రాష్ట్రా ల్లో బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని, అయినప్పటికీ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదన్న తీర్పు వలన రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా పోయిందని తెలిపారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కల్పించినప్పుడు దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతం అమలు జరుగుతున్న ఇవేమీ పట్టించు కోకుండా బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రమే 50% పరిమితి అంటూ బీసీలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో సమగ్ర కులగనన జరిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచినా నేటి వరకు అమలు జరగడం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల పైన భౌతిక దాడు లు, సామాజిక బహిష్కరణలు, కులం పేరుతో దూషణలు జరగకుండా సామాజిక రక్షణ కల్పించడానికి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించడం అభినందనీయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.

బీసీ రిజర్వేషన్లపై త్వరలోనే ప్రధానమంత్రి మోదీని కలుస్తామని, ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ సీఎంలు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ నిర్వహించాలని, ఎన్డీఏ కూటమిలో భాగస్వా మిగా ఉన్న చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ రక్షణ చట్టంపై సం క్రాంతి తర్వాత విజయవాడలో బీసీల మేధో మదన సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, బీసీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్విరావు, ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పా రావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, సుబ్బరావు, బాదన్న బాబయ్య, రాంబాబు, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.