25-07-2025 02:42:53 PM
కట్ట లింగస్వామి-డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి.
చండూరు, (విజయక్రాంతి): గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనమును తక్షణమే పూర్తి చేయాలని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం ప్రాథమిక పాఠశాల నిర్మాణాన్ని గత బిఆర్ఎస్ పార్టీ ఆయాంలో ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించారని, తర్వాత ఈ నిర్మాణాన్ని గాలికి వదిలేసారని, మండల కేంద్రంలోని ఒక ప్రాథమిక పాఠశాల లేని దుస్థితి ఉందంటే మండల వ్యాప్తంగా, జిల్లాలో, రాష్ట్రాలో విద్యా వ్యవస్థ పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇ పాలక ప్రభుత్వం యొక్క పనితీరు తెలిసిపోతుందని మండిపడ్డారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం కూడా విద్యావ్యవస్థను నాశనం చేసే నిర్ణయాలను తీసుకుంటుందని మండిపడ్డారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెరగాలని వేసవిని సైతం లెక్కచేయకుండా సెలవు దినాల్లో కూడా విధులు నిర్వహించి ప్రభుత్వ బడులను, విద్యను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉపాధ్యాయులు ఉంటే ప్రభుత్వాలు మాత్రం బడులను లేకుండా విద్యార్థులకు ఉపాధ్యాయులు విద్యను బోధించేటటువంటి సరైన సౌకర్యం లేకుంట ఉండడం సిగ్గుచేటు అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు విద్యా వ్యవస్థ మీద రివ్యూ నిర్వహిస్తున్నప్పటికీ ఈ సమస్యను గుర్తించకపోవడం పేద విద్యార్థుల మీద సవతి తల్లి ప్రేమను చూపించడం తప్ప మరొకటి కాదని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఈ రాజకీయాలు ఉండాలి గాని ప్రత్యర్థుల మీద రాజకీయాల కోసం అమాయకమైనటువంటి పేద ప్రజలను, పెద్ద విద్యార్థులను బలి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని అసంపూర్తిగా ఉన్నటువంటి పాఠశాల భవనాన్ని తక్షణమే నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల భవనం పూర్తయ్య వరకు తమ పోరాటాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు టేకుమట్ల కృష్ణ, ఉపాధ్యక్షులు మలిగే శివ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కర్నాటి సుధాకర్ పాల్గొన్నారు.