calender_icon.png 26 July, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యో.. సీతారామ! రామా కనవేమిరా..

26-07-2025 01:39:08 AM

ప్రాజెక్టు పూర్తయ్యేదెన్నడో?

  1. ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం 
  2. ఎనిమిదేళ్లలో అంచనా వ్యయం రూ. 11 వేల కోట్ల పెంపు
  3. ప్రభుత్వం మారినా పరిస్థితి మారలేదు 
  4. రూ.275 కోట్లకుగానూ కేవలం రూ.37 కోట్లే విడుదల
  5. ఇలాగైతే 25 ఏళ్లునా ప్రాజెక్టు పూర్తి కాదు 
  6. అప్పటికీ పూర్తికాని పక్షంలో వ్యయంతోపాటు వడ్డీ భారమే
  7. ప్రాజెక్టు పూర్తయితే ఏటా రూ.3,500 కోట్ల ఆదాయం

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): తెలంగాణలోని ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుల్లో సీతారామ ప్రాజెక్టు కూడా ఒకటి. 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టు లక్ష్యం. 4,500 క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు 113.5 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, 115 కిలోమీటర్ల సత్తుపల్లి కెనాల్, 78.32 కిలోమీటర్ల పాలేరు కెనాళ్లతోపాటు మూడు లిఫ్టులు, పంపు హౌస్‌లను కలిగి ఉన్నది. వీటికితోడు 8 డిస్టిబ్యూటరీ ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

2016 ఫిబ్రవరిలో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.7,900 కోట్లు. కానీ రెండేళ్లలో గత ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని పెంచింది. 2018 ఆగస్టు కల్లా వ్యయాన్ని రూ. 13,057 కోట్లకు అంచనా వేసింది. నిర్మాణ వ్యయంతో నీటి విడుదల సామర్థ్యం 4,500 క్యూసెక్కుల నుంచి 9 వేలకు పెరిగింది.

కానీ ఆయకట్టు మాత్రం నీటి విడుదల సామర్థ్యం పెరిగినంత గణనీయ స్థాయిలో పెరగలేదు. నిర్మా ణ వ్యయాన్ని దాదాపు రెట్టింపు పెంచినప్పటికీ ఆయకట్టును మాత్రం గత ప్రభుత్వం కేవలం 1.74 లక్షల ఎకరాలకు పెంచింది. 2016లో 5 లక్షల ఎకరాలున్న సీతారామ ప్రాజెక్టు ఆయకట్టును 2018 కల్లా 6.74 లక్షల ఎకరాలకు పెంచారు. 

ఎనిమిదేళ్లలో రూ. 19 కోట్లకు..

గత ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా మాత్రం ఎవరూ ఊహించనంతా వేగంగా పెరిగింది. కేవలం ఎనిమిదేళ్ల సమయంలోనే రెండున్నర రేట్లు వ్యయం అంచనా పెరిగింది. ఏకంగా రూ. 7,900 కోట్ల నుంచి రూ. 19,000 కోట్లకు పెంచారు. ఈ నమూనా నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ వెళ్తే ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఏ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుందో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, ప్రభుత్వానికి కాదు..

ఆ దేవుడికే తెలియాలి. సీతారామ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 8,200 కోట్లు ఖ ర్చు చేసింది. దీంతోపాటు రూ. 600 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా ఉన్నాయి. వీటిలో రూ.300 కోట్లు నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు కాగా, రూ. 150 కోట్లు ట్రా న్స్‌కోకు, రూ. 150 కోట్లు భూసేకరణ కోసం ఇవ్వాల్సి ఉంది. 

రైతుల ఆశలపై నీళ్లు..

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల రైతాంగానికి ఆయకట్టుకు నీరు అందించే అవకాశం లభిస్తుంది. ఆ జిల్లాల్లో కొత్తగూడెం భద్రాచలం, ఖమ్మం, మహబూబాబాద్ ఉన్నాయి. మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్‌రావు సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులపై  2025 మే 10వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మూడు గంటలపాటు కొనసాగిన సుదీర్ఘ సమావేశంలో 20 మంది ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు, 25 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

అయితే ప్రాజెక్టుకు రూ. 11 వేల కోట్ల నిధులను ఇచ్చి, భూ సేకరణ పూర్తిచేస్తే రెండేళ్లలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు ప్రయోజనాలను అందించవచ్చని ఈ  సందర్భంగా మంత్రులకు అధికారులు వివరించా రు. నలుగురు సీనియర్ మంత్రులు కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడంతో సీతారామ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుందని అందరూ ఆశించారు. రెండేళ్లలో కాకపోయినా కనీసం మూడేళ్లలోనైనా నిధులు మంజూరవుతాయని విశ్వసించారు.

మరో 25 ఏళ్లయినా..

 వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపు డిస్ట్రిబ్యూటరీలతో సహా ప్రాజెక్టు అంతా పూర్తవుతుందని కొత్తగూడెం భద్రాచలం, ఖమ్మం జిల్లాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తవుతుందని, తమ ఆయకట్టుకు నీరందుతుందని రైతుల పెట్టుకున్న ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. వాస్తవానికి ప్రతి నెలా రూ. 275 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ మే, జూన్ నెలలకు కలిపి ప్రభుత్వం కేవలం రూ. 37 కోట్లు మాత్రం విడుదల చేసింది.

ఈ రకంగానే ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ పోతే 25 ఏళ్లు అయినా ప్రాజెక్టు పూర్తి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా అంచనాలను మించి పెరుగుతుంది. ఫలితంగా ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్న ప్రజలు భారీగా నష్ట పోయే ప్రమాదం ఉంది. 

ఆ మూడు కంపెనీలకే ఎందుకు..?

సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వం మే, జూన్ నెలలకు గానూ ప్రాజెక్టు కోసం విడుదల చేసిన నిధులు కేవలం మూడు కంపెనీలకే చెల్లించింది. ప్రాజెక్టుకు సంబంధించి విడుదల కావాల్సిన రూ. 300 కోట్లలో రూ. 37 కోట్లను హెచ్‌ఈఎస్, ప్రసాద్ అండ్ కో, బీవీఆర్ కంపెనీలకు మాత్రమే విడుదల చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ. 8 వేల కోట్లకు గానూ ప్రతి ఏడాది రూ. 1,000 కోట్ల వడ్డీని చెల్లిస్తుంది. కానీ ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఆదాయంగా తిరిగి రాకపోవడంపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

రూ. 3,500 కోట్ల ఆదాయం..

 ఇప్పటికైనా ప్రభుత్వం, నీటి పారుదల శాఖ ప్రాజెక్టు పునర్విభజన చేయడంతోపాటు న్యాయ బద్ధంగా నిధులను ఖర్చు చేసి, త్వరితగతిన ప్రజలకు ప్రాజెక్టు ఫలా లను అందించే దిశగా కృషి చేస్తుందని ఆశిస్తున్నారు. అయితే సీతా రామ ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఏడాది పంటల ద్వారా రూ. 3,500 కోట్ల ఆదాయం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో సీతా రామ ప్రాజెక్టు పూర్తి చేయడంపై ప్రభు త్వం మరింత చిత్తశుద్ధి కనబర్చాల్సిన అవసరం ఉంది.