అబద్ధాల్లో కాంగ్రెస్ నేతల పోటీ
l యువత, రైతులను మోసే చేసేందుకు కుట్రలు
l నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఎగవేతకు ప్రయత్నాలు
l కే తారకరామారావు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. అన్ని వర్గాలకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 120 రోజుల పాలనలో నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనాయకులు హామీ ఇచ్చారు.
అబద్దాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించి అబాసుపాలైన భట్టి, తాజాగా రుణామాఫీపై నాలుక మడత బెట్టారని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని చెప్పడం రైతులను ఘోరంగా వంచించడమేనన్నారు. డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ హోదాలో చెప్పిన విషయం భట్టికి తెలియనట్లు నటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఏరుదాటే దాక ఓడ మల్లన్న, ఏరు దాటక బోడిమల్లన్న అన్నట్లు కాంగ్రెస్ నేతల వ్యవహారం ఉందని, ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించి అధికారం చేపట్టిన తరువాత మొండి చేయి చూపిస్తుందని మండిపడ్డారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ల ఇస్తామని గతంలో కాంగ్రెస్ అన్ని పత్రికల మొదటి పేజీల్లో ప్రకటన ఇచ్చిందని, తమ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లు నిసిగ్గుగా తమ ఖాతాలో వేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అన్నింటినీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. నిన్న నిరుద్యోగ భృతి ఎగవేత, నేడు రుణమాఫీపై దాటవేత దోరణి ఆ పార్టీ నేతల మోసాలకు సాక్ష్యాలని పేర్కొన్నారు.






