23 May, 2026 | 2:39 AM

ఓటమి భయంతోనే కిషన్‌రెడ్డి నివేదిక

20-04-2024 12:13 AM

l కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏమీ చేయలేదు

l బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవటంతోనే ప్రజలకు నివేదిక పేరిట ఒక పత్రం విడుదల చేసి కొత్త నాటకాలకు తెర లేపారని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం  మాట్లాడుతూ ఆయనకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకువస్తారని, కేంద్రం పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చిందని గొప్పలు చెబుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

సికింద్రాబాద్ నియోజకవర్గానికి రూ.6వేల కోట్లు తెచ్చానని చెప్పకోవడం హాస్యాస్పదంగా ఉందని,  అన్ని నిధులు తేస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఒక సీటు కూడా ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. రైల్వే స్టేషన్‌లో లిఫ్టులు, పంపులు ప్రారంభించి కుర్‌కురే ప్యాకెట్లు పంచడం తప్ప ఆయన రాష్ట్రానికి ఏం సాధించలేదన్నారు. ఓటమి భయంతోనే నివేదికలతో ప్రజలను భ్రమల్లో పెడుతున్నారని, బీఆర్‌ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలకు బీజేపీ నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు.

విభజన చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ నేరవేర్చలేదని, కేంద్రమంత్రిగా ఆయన రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. నగరంలో వరదలు వచ్చినప్పుడు ఒక రూపాయి నిధులు ఇవ్వలేదని, రాజ్యాంగపరంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. కిషన్‌రెడ్డి ఎన్ని నివేదికలు ఇచ్చిన ఆయన అసలైన రిపోర్టు ప్రజల దగ్గర ఉందని, ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు.