16-10-2025 12:13:58 AM
జిన్నారం, అక్టోబర్ 15 : చలికాలం నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని పూర్తిగా కట్టడి చేయాలని పరిశ్రమల ప్రతినిధులకు రామచంద్రాపురం జోనల్ పీసీబీ ఈఈ కుమార్ పాఠక్ సూచించారు. బుధవారం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఖాజీపల్లి, గడ్డపోతారం పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడంతో పాటు రసాయన వ్యర్ధాల విషయంలో తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు. ఇటీవల బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం పరిశ్రమల నుంచి వెలువడిన వాయు కాలుష్యంతో సమీపంలో ఉన్న ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురై ఆందోళన చేశారు.
ఈ నేపథ్యంలో పరిశ్రమల ప్రతినిధులతో పీసీబీ అధికారులు ఈ సమావేశాన్ని నిర్వహించారు. మోడల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ వీ వీ ఎస్ ఎన్ మూర్తి, పీసీబీ సీనియర్ అనలిస్ట్ రవీందర్, మోడల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.