calender_icon.png 3 August, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు, పోలీసు అధికారుల సమన్వయంతో సైబర్‌ నేరాల నియంత్రించండి

30-11-2024 06:38:08 PM

మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి..

మణుగూరు: బ్యాంకు సిబ్బంది, పోలీస్‌ అధికారులతో సమన్వయంతో పనిచేస్తే సైబర్‌ నేరాలను నియంత్రించాలని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో మండల వ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు మేనేజర్లతో బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక, సైబర్‌ నేరాలు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ.. చోరీల కన్నా సైబర్‌ మోసాల ద్వారా ప్రజలు ఎక్కువ మొత్తంలో నగదు పోగొట్టుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఈ నేరాలను తగ్గుముఖం పట్టేలా, నగదు పోగొట్టుకున్న భాదితులకు న్యాయం చేసే దిశగా బ్యాంకు అధికారులు, పోలీసులు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ముఖ్యంగా నిరక్ష్యరాసులు, గిరిజనులు మండలంలో ఎక్కువగా ఉన్నందున వారు రోజువారీ కష్టబడి సంపాందించిన సొత్తు అవగాహన లోపంతో పోగొట్టుకొంటున్నారని తెలిపారు. మోసగాళ్లు కొత్త కొత్త తరహాల్లో మోసాలకు పాల్పడుతూ, ప్రజల నుండి డబ్బులను దోచేస్తున్నారని, వాటిని నియంత్రించేందుకు బ్యాంకు అధికారులు కూడా సకాలంలో స్పందించి, తమ వంతు సహకారాలను పోలీసు అధికారులకు అందించాలని కోరారు. పోలీసు అధికారులు కూడా దర్యాప్తులో భాగంగానే బ్యాంకుల నుండి సమాచారాన్ని కోరుతున్నారన్న విషయాన్ని అధికారులు గ్రహించాలన్నారు. సమాచారాన్ని సకాలంలో ఇవ్వకుంటే మోసానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకొనే అవకాశంతో పాటు నిందితుడి బ్యాంకు అకౌంటులో జమ అయిన నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా నగదు తిరిగి పొందే అవకాశాలు తక్కువని ఆయన చెప్పారు.

ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే అనుమానాస్పద బ్యాంకు అకౌంట్లపై నిఘా పెట్టాలని సూచించారు. ఫేక్‌ లోన్‌ యాప్‌ల ద్వారా, సామాజిక మాధ్యమాలలో లింక్‌లను పంపి ఇన్వెస్ట్‌మెంట్‌ చేయాలని నమ్మించడం, డిజిటల్‌ అరెస్టు, ఫెడెక్స్‌, బ్లూ డాట్‌ కొరియర్స్‌, క్రెడిట్‌ కార్డు, ఒటిపి మోసాలు వంటి వాటి గురించి బ్యాంకు అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు తూచ తప్పకుండా పాటించాలని, ఎటిఎం కేంద్రాల వద్ద కచ్చితంగా గార్డును నియమించాలని సూచించారు. ఎవరైనా ఆన్‌లైన్‌ మోసాల బారిన పడి బ్యాంకులకు వస్తే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ- 1930, వెబ్‌సైట్‌ గురించి అవగాహన కల్పించి, ఫిర్యాదు చేయించాలన్నారు. ఈ  కార్యక్రమంలో ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.