ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యం: ఏసీపీ కృష్ణయ్య
‘నేను సైతం 2.0‘లో భాగంగా తట్టి అన్నారం డబుల్ బెడ్రూమ్
కాలనీలో 54 సీసీటీవీ కెమెరాల ప్రారంభం
నాగోల్, జూలై 6 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘నేను సైతం 2.0‘ కార్యక్రమంలో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం డబుల్ బెడ్రూమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన 54 సీసీటీవీ కెమెరాలను ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, నేరాల దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. నివాసితులు స్వచ్ఛందంగా తమ సొంత వ్యయంతో కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజ భద్రత కోసం ప్రతి కాలనీ, అపార్ట్మెంట్, వాణిజ్య సంస్థ సీసీటీవీ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
తట్టి అన్నారం డబుల్ బెడ్రూమ్ గేటెడ్ కమ్యూనిటీలోని నాలుగు బ్లాకుల నివాసితులు కలిసి 54 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం పోలీసు-ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని ఏసీపీ కృష్ణయ్య అన్నారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాగోల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐ శివ నాగ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ దేవిడి వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ ఇన్చార్జ్లు రిజ్వాన్, భాస్కర్, దేవేందర్, మొహమ్మద్ ఖాతీజా బేగం తదితరులు పాల్గొన్నారు.






