సమస్యలు నిల్.. అక్రమ కట్టడాలు ఫుల్
ప్రజావాణిలో సమస్యలన్నీ అక్రమ కట్టాడాలే..
కూకట్‌పల్లి, జులై 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అసలు సమస్యలే లేనట్టు సమస్యలపై ఫిర్యాదులు రావడం లేదు ఒక్క టౌన్ ప్లానింగ్ విభాగం పై తప్ప..?. కూకట్పల్లి జోనల్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ విభాగంపై 5 ఫిర్యాదులు, ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో నిర్వహించిన ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి 5 ఫిర్యాదులు రాగా శానిటేషన్ విభాగానికి మరో ఫిర్యాదు అందింది.
కూకట్ పల్లి, ఆల్విన్ కాలనీ సర్కిల్ ల పరిధిలో స్థానికంగా నెలకొన్న సమస్యలపై గత కొంతకాలంగా స్థానిక ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సందర్భాలు తక్కువగా కనబడుతున్నాయి. కానీ కొందరు అదే పనిగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగంపై కుప్పలు తిప్పలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. టౌన్ ప్లానిం గ్ విభాగంలోని అధికారులు స్పందించి ఫిర్యాదుదారునికి అనుకూలంగా వ్యవహరించడంతో ఈ విభాగానికి ఫిర్యాదులు అధికమవుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదు వచ్చిన అక్రమ నిర్మాణా లపై చర్యలు తీసుకోకుండా ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని వా దనలు వినిపిస్తున్నాయి. ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో అధిక శాతం ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో ఇప్పటివరకు ఏ అక్రమ నిర్మాణంపై ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలు కనిపించడం లేదు. కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ సర్కిల్ ల పరిధిలో ఓవైపు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు పెరుగుతున్నప్పటికీ అదే స్థాయి లో అక్రమ నిర్మాణాలు కూడా కొనసాగుతున్నాయి.
అయినా అధికారులు మాత్రం చర్య లు ఎందుకు తీసుకోవడం లేదని, అందులో మర్మం ఏమిటో అర్థం కావడం లేదని స్థానికంగా గుసగుసలు వినబడుతున్నాయి. సర్కిల్‌ల పరిధిలో డ్రైనేజీ, త్రాగునీరు, విద్యు త్తు, రోడ్లు వంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రజావాణిలో ఫిర్యాదులు అందడం లేదు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించరని స్థానిక ప్రజలలో నమ్మకం బలంగా ఉండడంతో సమస్యలపై ఫిర్యాదులు చేయడం లేదనే వాదనలు ప్రజలలో బలంగా వినిపిస్తున్నాయి.






