14 August, 2026 | 2:31 AM

విరాళాలపై వివాదం

14-08-2026 12:00 AM

విదేశీ విరాళాల నియంత్రణకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లు దేశంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాల్సి వచ్చింది. కాగా, విదేశీ నిధులు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వినియోగించకుండా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, జాతీయ భద్రతను కారణంగా చూపుతున్న కేంద్రప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన కీలక సవరణలను విపక్షాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

విదేశీ విరాళాలను దుర్వినియోగం చేసే సంస్థలపై చర్యలు తీసుకునే సందర్భంలో మిగులు నిధులు, ఆస్తుల స్వాధీనం, నియంత్రణను ప్రత్యేకాధికారికి కట్టబెట్టే నిబంధన ప్రస్తుత వివాదానికి కేంద్రబిందువుగా మారింది. విదేశీ విరాళాల నిబంధనలను ఉల్లంఘించిన సంస్థపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించరు. కానీ, సదరు సంస్థ రద్దు, నిధులు, ఆస్తుల స్వాధీనం, పూర్తి నియంత్రణ వంటి సర్వాధికారాలు ప్రభుత్వానికి విస్తృతంగా లభిస్తే, వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం లేకపోలేదన్న ప్రతిపక్షాల ఆందోళనను విస్మరించలేం.

విదేశీ విరాళాల సాయంతో విద్య, వైద్యం, విపత్తుల సమయంలో సహాయం, మెరుగైన జీవనం, పేదల సంక్షేమం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు మన దేశంలో అనేకం ఉన్నాయి. కొత్త నిబంధనలు ప్రభుత్వానికి గిట్టని సంస్థల పాలిట పెనుశాపంగా మారవచ్చు. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీలు, మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. వాస్తవానికి జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు విదేశీ నిధులను మళ్లించడం తీవ్ర నేరం.

విదేశీ నిధులను సేకరిస్తూ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే సంస్థలకు అనుకూలంగా ఉన్న చట్టంలోని లొసుగులను ఎప్పటికప్పుడు సవరించాలి. అలాంటి సంస్థలపై ఉక్కుపాదం మోపాల్సిందే. అయితే, కొన్ని సంస్థలు చేస్తున్న అక్రమాలు, తప్పులను సాకుగా చూపుతూ సమాజ సేవలో నిమగ్నమైన వేలాది స్వచ్ఛంద, ధార్మిక సంస్థలపై నియంత్రణ విధించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన చట్టాన్ని బలపరచడం అవసరమే. అదే సమయంలో ఆ చట్టం దుర్వినియోగానికి ఆస్కారం లేని విధంగా తగిన నియంత్రణలు, న్యాయపరమైన రక్షణలు కూడా చట్టంలో ఉండాలని చెప్పక తప్పదు.