ధీరుల త్యాగ ఫలం
ఎన్నో బెదిరింపు చర్యల
ఎదిరింపు పరంపర
ఎన్నెన్నో తిరగబడి
బిగించిన ఉక్కు పిడికిళ్లు
మరెన్నో బలిదానాల
నెత్తుటి మరకల పేజీలు
ఇంకెన్నో ఉవ్వెత్తున
ఎగిసిపడే అగ్నికెరటాలు!
ఆంగ్ల వలస పాలన విముక్తికై
తూటాలకు ఎదురొడ్డి
బానిస బంధన చేధనకై
ఉరికంబానికి ఊయలలూగి
ఓ అహింసా వాదం
మరో సాయుధ పోరు మార్గం
కుల మత భాషా బేషజాలకు
నిప్పంటించిన సంఘటితం!
లాల్ బాల్ పాల్ వీరసావర్కర్
భగత్ ఆజాద్ అల్లూరి గాంధీ
నేతాజీ వీరనారి ఝాన్సీ
వేలవేల ఉద్యమ దివిటీల
ఉత్ప్రేరక కారకం
అంచెలంచెల క్విట్ ఇండియా
ఉద్యమ శిఖరాగ్రం!
అఖండ భారత
అశేష జన నినాదం
కవి గాయక నాయక
చైతన్య ప్రవాహం
ఎదఎదలో దేశభక్తి
సమైక్య గీతాలాపనం
నిద్రాణ జాతి యావత్తు
జాగృతమైన వైనం!
అమెరికా పౌరహక్కుల
సమరానికి ప్రేరణగా
దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష
పోరుకు మార్గదర్శిగా
ఒకటా రెండా శతవసంతాల
పోరాట ఘనచరిత
భరతమాత చరణాల చెంత
నెత్తుటి దీపారాధన!
దేశమిచ్చిన దేహం
కణకణం దేశానికే అర్పితం
తల్లీ! నీకోసం మరణం
నాజన్మ ధన్యమనే సంకేతం
ధీరుల త్యాగ గుణం
భావితరం ఆశల వారధి కోసం
స్వేచ్ఛ సుమ ఫలాలిచ్చిన
అమర వీరులకు వందనం!
(స్వాతంత్య్ర దినోత్సవ
శుభాకాంక్షలతో)
వ్యాసకర్త సెల్: 8555010108






