05-01-2026 12:50:18 AM
మహబూబాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖ మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం అమలు నిర్వాహకులకు జిల్లా స్థాయి వంటల పోటీలు ఆదివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల నుండి ఒక్కో మండలాన్ని ప్రతినిధ్యం వహిస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోషకాహారం, సమతుల్యత, పరిశుభ్రత అంశాలను ప్రాతిపదికగా చేసుకుని పోటీలు నిర్వహించగా, ప్రథమ బహుమతి కురవి మండలం తెలంగాణ మోడల్ స్కూల్ (నేరడ), ద్వితీయ బహుమతి కేసముద్రం మండలం జెడ్పిహెచ్‌ఎస్ కల్వల, తృతీయ బహుమతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మహబూబాబాద్ దక్కించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి వి. రాజేశ్వర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు ఎంతో రుచికరంగా, పరిశుభ్రంగా భోజనం సిద్ధం చేయడం అభినందనీయమని తెలిపారు. ఇదే విధమైన నాణ్యమైన ఆహారాన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అందించాలని సూచించారు. పోటీలకు జడ్జీలుగా న్యూట్రిషన్ నిపుణులు శ్రీనివాస్, దీప్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు, స్థానిక ప్రధానోపాధ్యాయులు భూక్య సిరినాయక్, మధ్యాహ్న భోజన జిల్లా ఇన్చార్జి శ్రీగణేష్ పాల్గొన్నారు.