05-01-2026 12:49:18 AM
చిలకలగుట్ట పవిత్రత కాపాడటం మన అందరి బాధ్యత
పూజారులు, ఆదివాసి సంఘాలు, అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క
ములుగు, జనవరి4 (విజయక్రాంతి): ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపు దిద్దుకుంటుం దని సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట పవిత్రత కాపాడటం మన అందరి బాధ్యత అని,పూజారులు ఆదివాసి సంఘాలు అధికారుల సమన్వయంతో జాతర విజయ వంతం చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంహరిత హోటల్ లో శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026నిర్వహణపై మేడారం వన దేవతల పూజారులతో ఆదివాసి సంఘాల నాయకులతో రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా లతో కలిసి అభిప్రాయాల సేకరణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ శ్రీసమ్మక్క సారలమ్మ జాతర 2026 విజయవంతం చేయడానికి పూజారుల ఆదివాసి సంఘాల నాయకుల సహకారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
జాతర నిర్వహణ పై ఆదివాసి సంఘాల నాయకుల తమ అభిప్రాయాలను తెలుపాలని సూచించారు. వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు గిరిజనుల రాజ్యాంగ బద్దంగా గిరిజనుల హక్కుల ప్రకారం నిర్వహించడానికి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించాలని, జాతరకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాటు చేయాలని, భక్తులకు సేవలను అందించడానికి ఆదివాసి సంఘాల 500 యువకులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని,పూర్తిస్థాయిలో శాశ్వత ప్రతిపాదికన ఆదివాసీలతో కూడిన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పూజారుల ,ఆదివాసి సంఘాల సలహాలు సూచనలు వారి సమన్వయంతో జాతర విజయవంతం చేస్తామని తెలిపారు.
కోట్లాది మంది భక్తుల విశ్వాసం మేడారం జాతర తరతరాలకు గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని, సమ్మక్క సారలమ్మ వారసులుగా గిరిజనులకు గుర్తింపు లభిస్తుందని, ఆదివాసి సంఘాలు వారి సభ్యుల వివరాలు అధికారులకు అందించాలని పేర్కొన్నారు. చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను తీసుకవచేటప్పుడు ఆదివాసి యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వాలంటరీ సభ్యులకు మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీలను పూర్తిగా బంద్ చేయడం జరుగుతుందని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనం ఏ విధంగా చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
హమాలీ కమ్యూనిటీ నూతన భవనం ప్రారంభం
ములుగు, జనవరి4 (విజయక్రాంతి): పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సుమారు 11లక్షల రూపాయలతో జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన హమాలీ కమ్యూనిటీ భవనాన్ని ఆదివారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు హమాలీ సోదరులు పొద్దున్నే వారి పనులను ప్రారంభిం చుకుని మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి చెట్ల కింద,బయట ప్రదేశాల్లో కూర్చుని సేదతీరడం చూసి వారికి ఒక భవనం ఉంటే వారికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో నూతన భవనం నిర్మించి వారికి అండగా ఉన్నామని రాబోయే రోజుల్లో కూడా వారికి ఎలాంటి అవసరం ఉన్న సహకరిస్తామని తెలిపారు.