10 March, 2026 | 9:20 AM

మహిళా దినోత్సవం రోజు వంటింట్లో మంట

09-03-2026 02:50 AM

అమాంతం పెరిగిన వంటగ్యాస్ ధరలు

గృహ అవసరాలకు రూ.60, వాణిజ్యానికి రూ.115 పెంపు

ఉమ్మడి జిల్లాపై నెలకు రూ.9.73 కోట్ల అదనపు భారం

కరీంనగర్, మార్చి 8 (విజయ క్రాంతి): మహిళా దినోత్సవం రోజు గ్యాస్ ధరల పెంపు వంటింట్లో మంట పుట్టిస్తున్నది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు స్థానిక మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైతే చమురు సెగలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తాయన్న ఆందోళన నిజమైంది.  11 నెలల సుదీర్ఘ విరామం అనంతరం దేశీయ మార్కెట్ లో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.

గహ అవసరాలకు వాడే సిలిండర్ పై  60, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 13.8 లక్షల కనెక్షన్లపై ఈ ప్రభావం నెలకు కోట్లాది రూపాయల భారంగా పరిణమించనుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామన్న మహాలక్ష్మి పథకం రాయితీ సొమ్ము అందక, మరోవైపు పెరిగిన ధరలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 3,50,398 గహ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సిలిండ్ప 60 రూపాయల పెంపు వల్ల ప్రజల నెత్తిన నెలకు 2.10కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక వాణిజ్య పరంగా ఉన్న 80,729 కనెక్షన్ల ద్వారా మరో 92.83 లక్షలు అదనంగా భారం పడనుంది. కరీంనగర్ జిల్లాలోనే మొత్తం 3 కోట్ల అదనంగా భారం పడనుంది. జగిత్యాల  జిల్లాలో 3,39,715 గహ కనెక్షన్లు ఉన్నాయి. పెరిగిన ధరలతో ఇక్కడ నెలకు 2.03కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది.

వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 62,285 కనెక్షన్ల పై 71.62లక్షల భారం పడుతోంది. పెద్దపల్లి జిల్లాలో 2,27,408 గృహ  వినియోగదారులు ఉన్నారు. వీరిపై 1.36 కోట్లు, 78,310 వాణిజ్య కనెక్షన్లపై 90లక్షల పైనే అదనపు భారం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 2,01,461 గృహ వినియోగ దారులపై 1.20 కోట్ల భారం, 41,351 వాణిజ్య కనెక్షన్లపై 47.55 లక్షల భారం పడనుంది. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 11.18 లక్షల గృహ వినియోగదారులపై నెలకు 6.71 కోట్ల అదనపు భారం పడనుండగా, 2.62 లక్షల వాణిజ్య కనెక్షన్ల ద్వారా 3.02 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. నెలకు దాదాపు ర9.73 కోట్ల రూపాయలు అదనంగా గ్యాస్ కంపెనీల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి.

గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు

మహిళా దినోత్సవం రోజు బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటు. ప్రభుత్వాలు మహిళల పట్ల ప్రకటనాలకు వాగ్దానలకే పరిమితం అవుతున్నాయి. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుడి పై భారం పడుతుంది. వెంటనే గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలి. 

టియుసిసి కేంద్రకమిటీ సభ్యులు బండారి శేఖర్

ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలి 

గ్యాస్ ధరలతో పాటు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల హోటల్ రంగం కుదేలవుతోంది.  రేట్లు పెంచక తప్పని పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది. దీనివల్ల అంతిమంగా సామాన్య ప్రజలే నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి, తక్షణమే అప్రమత్తమై ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో ప్రజల తరపున పెద్ద ఎత్తున నిరసనలు తప్పవు.

 అజీమ్, 45వ డివిజన్, కరీంనగర్