వెల్దిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
11 వాహనాలు, 6 ఇసుక డంపులు స్వాధీనం
అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపుతాం: రూరల్ ఏసీపీ విజయ్ కుమార్
మానకొండూరు, జూన్ 19 (విజయక్రాంతి): సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా శుక్రవారం కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో భారీ స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్) నిర్వహించారు.
ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్‌ఐలు, 11 మంది ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, 18 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఏడుగురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, 24 మంది స్పెషల్ యాక్షన్ టీమ్ (SAT) సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్దిలో సుమారు 350 మంది ప్రజలతో, పోలీసులు ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అవగాహన కల్పించారు. అదే సమయంలో గ్రామంలో వాహనాల ధృవీకరణ తనిఖీలు చేపట్టి 76 ద్విచక్ర వాహనాలు, ఒక త్రిచక్ర వాహనాన్ని పరిశీలించారు.
అక్రమ ఇసుక నిల్వలు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు రెండు ఇసుకతో లోడ్ చేసిన ట్రాక్టర్లు, రెండు, ఇంజన్ లేని ఇసుక ట్రైలర్లు, ఆరు అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణా, నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై మూడు దశల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటి తప్పిదానికి భారీ జరిమానా విధిస్తామని, రెండోసారి నేరానికి పాల్పడితే బైండోవర్ చర్యలు చేపడతామని, మూడోసారి పట్టుబడితే సంబంధిత వాహనాలను శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారెవరైనా కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు.






