ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, జూన్ 19 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని వివిధ ప్రమాదాల్లో గాయపడి జిల్లా కేంద్రంలోని సన్రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం శుక్రవారం పరామర్శించారు.
గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తూ తాడిచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఉప్పారమల్యాల గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు లంకదాసరి మల్లయ్య రోడ్డు ప్రమాదానికి గురై అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.
అనంతరం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వం, పార్టీ తరపున బాధితుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి బైరిశెట్టి సంపత్, బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






