08-08-2025 09:00:31 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): అక్రమ దందాలకు చెక్ పెట్టేందుకే పోలీసు శాఖ కార్డన్ సెర్చ్(Cordon search) నిర్వహిస్తుందని మహబూబాబాద్ డి.ఎస్.పి తిరుపతిరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున కేసముద్రం పట్టణంలోని గిర్ని తండా, కొత్తగూడా మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున గుడుంబా తయారీకి సిద్ధం చేసిన బెల్లం పానకాన్ని పారబోశారు.
అలాగే రెండు క్వింటాలకు పైగా నల్ల బెల్లం, 50 లీటర్ల గుడుంబా, 40 కి పైగా ఎలాంటి ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ అక్రమ వ్యవహారాలకు ఎవరు కూడా పాల్పడకూడదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసమే కార్డెన్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ అంశాలపై ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పోలీస్ డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.