08-08-2025 11:38:27 AM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) శుక్రవారం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తన దగ్గర ఉన్న ఆధారాలను బండి సంజయ్ సిట్ కు సమర్పించనున్నారు. ఈ సంరద్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... విచారణకు రావాలని సిట్ గతవారమే నాకు నోటీసులు ఇచ్చిందన్నారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పానని తెలిపారు.
నా వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలు సిట్ అధికారులకు ఇస్తానని వివరించారు. కేంద్రమంత్రిగా, బాధ్యత గత పౌరుడిగా ఆధారాలు సమర్పిస్తానని వెల్లడించారు. ''తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్(Telangana phone tapping case) ను మొదట బయటపెట్టిందే నేనే.. ఫోన్ ట్యాపింగ్ కు మొదటి బాధితుడిని నేనే'' అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్ అధికారుల మీద తనకు నమ్మకం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని, ఇదంతా టైంపాస్ కోసమే బండి సంజయ్ పేర్కొన్నారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని విమర్శించారు. కమిషన్లు, విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.. ఫోన్ ట్యాపింగ్ కేసును ఏసీబీకి అప్పగిస్తే మొత్తం బయటపెడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.