ప్రభుత్వ బడుల్లోనే కార్పొరేట్ విద్య
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను అందించడంతోపాటు మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పాఠశాలలు త్వరలో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించే విధంగా విద్యాబోధన సాగాలని సూచించారు.
ఇప్పటికే మండలాలకు పాఠ్యపుస్తకాల పంపిణీ దాదాపు పూర్తయిందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. అన్ని విద్యాసంస్థల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాలలు, వసతి గృహాలు, వంటశాలలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు.
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నందున, వసతి గృహాల్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాల గడువు తేదీలను పరిశీలించి, నాసిరకం లేదా గడువు ముగిసిన సరుకులు వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన భోజనాన్ని అందించడంలో మెస్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ భోజన ప్రమాణాలు, ఆహార పదార్థాల నాణ్యతను మెస్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
స్టోర్ రూమ్లలో కూరగాయలు, ఇతర వస్తువులను సక్రమంగా భద్రపరచాలని తెలిపారు. వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలని, తప్పనిసరిగా మాస్కులు, ఏప్రాన్లు, తల టోపీలు ధరించాలని ఆదేశించారు. వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడంతో పాటు వంటశాలల్లో మిగిలిన ఆహారం, చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు వసతి గృహాల్లో ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు దయానంద్, అంబాజీ, శ్రీనివాస్, ఎంఈఓలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






