15 April, 2026 | 5:08 PM

అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో అవినీతి

14-04-2026 01:43 AM
  1. రూ. 54 కోట్ల టెంబర్‌లో రూ. 30 కోట్ల కుంభకోణమంటూ ఆరోపణలు
  2. రూ. 6,500ల ఫోన్‌కు రూ. 14,500 లకు కొనుగోలు
  3.   5జీ పేరిట 4జీ ఫోన్ పంపిణీ చేశారని బీఆర్‌ఎస్ విమర్శలు
  4. మంత్రి సీతక్క, బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ మధ్య మాటల యుద్ధం

మార్కెట్‌లో కేవలం రూ. 6,500 విలువ చేసే ఫోన్‌ను రూ. 14,500కు కొనుగోలు చేశారు.. 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పి 4జీ పరికరాలనే సరఫరా చేశారు.. ఈ టెండర్ విలువ రూ. 54 కోట్లు.. మొత్తం వ్యవహారంలో సుమారు రూ. 30 కోట్ల వరకు అవినీతి జరిగింది. ఇదీ అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్‌ఫోన్ల పంపిణీలో జరిగిన భాగోతం అంటూ బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. దీనితో అధికార మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధం మొదలైంది. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపణలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : అంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్‌ఫోన్ల పంపిణీ పేరుతో చేపట్టిన రూ. 54 కోట్ల టెండర్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్కెట్‌లో కేవ లం రూ. 6,500 విలువ చేసే ఫోన్లను ఒక్కోటి రూ. 14,500కు కొనుగోలు చేశారని, 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పి వాస్తవానికి 4జీ పరికరాలనే సరఫరా చేశారని బీఆర్‌ఎస్ తీవ్ర ఆరోపణలు చేయడంతో వివాదం సంచలనంగా మారింది.

మొత్తం వ్యవహారంలో సుమారు రూ. 30 కోట్ల వరకు అవి నీతి జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఇక ఈ ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా ఖండిస్తూ, కొనుగోలు పూర్తిగా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేయడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. అంగన్వాడీ సేవల ఆధునికీకరణ కోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తున్నదని ప్రభుత్వం ఆరోపిస్తుండగా, మరోవైపు టెండర్ ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్ పట్టుబడుతోంది.

దీంతో ఈ అంశం కేవలం అవినీతి ఆరోపణలకే పరిమితం కాకుండా, అధికారెేప్రతిపక్షాల మ ధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధానికి దారితీసింది. అంగన్‌వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపి ణీలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపణలు చేయగా దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీనికి తోడు బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారని, దాని కి పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయనకు లీగల్ నోటీసులు కూడా పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. 

మంత్రి సీతక్క కౌంటర్... 

అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై వస్తున్న ఆరోపణలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ చేస్తు న్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారం, పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. కేవలం ఫోన్ ధర ఆధారంగా కాకు ండా సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్, ప్రభుత్వ యాప్ల సపోర్ట్, వారంటీ, సర్వీస్ మెయింటెనెన్స్, ఫీల్ స్థాయి ట్రైనింగ్ వంటి అంశాలను కలిపి మొత్తం ప్యాకేజ్గా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.

అదేవిధంగా, 5జీఔ వివాదంపై స్పందిస్తూ, ప్రాజెక్ట్ అవసరాలు, నెట్‌వర్క్ అందుబాటు, ఫీల్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పరికరాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజల్లో అపోహలు కలిగించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం అంగన్వాడీ సేవలను ఆధునికీకరించడం, ఫీల్ స్థాయిలో పనితీరును మెరుగుపరచడమేనని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కో సం తీసుకున్న చర్యలను రాజకీయంగా మలచడం దురదృష్టకరమని విమర్శించారు. 

ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం... 

అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం వివాదం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన మా టల యుద్ధానికి దారి తీసింది. బీఆర్‌ఎస్ ఒకవైపు ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీ స్తుండగా, మరోవైపు మంత్రి సీతక్క నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ ఎదురుదాడికి దిగుతోంది. బీఆర్‌ఎస్ నేతలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

ప్రజా ధనం దోపిడీ జరిగిందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారాన్ని ప్రధాన రాజకీయ అజెండాగా మలుస్తున్నారు. బీఆర్‌ఎస్ ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంగన్వాడీ వ్యవస్థను ఆధునికీకరించేందుకు తీసుకున్న చర్యలను ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజాధనానికి సంబంధించిన ప్రాజెక్ట్ కావడంతో, ఆరోపణలు వచ్చిన వెంటనే పారదర్శక విచారణ జరగడం అత్యంత కీలకమని వారు సూచిస్తున్నారు. టెండర్ ప్రక్రియ మొత్తం స్వతంత్ర సంస్థ ద్వారా పరిశీలించాలి, ధరల నిర్ణయం, టెక్నికల్ స్పెసిఫికేషన్లను లోతుగా ఆడిట్ చేయాలి, సరఫరా చేసిన ఫోన్ల నాణ్యతపై థర్డ్ పార్టీ టెక్నికల్ వెరిఫికేషన్ చేయాలి, బాధ్యులపై నిర్ధిష్ట ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు ఆరోపణలు నిజమా కాదా అన్నది తేల్చడానికి సీబీఐ వంటి కేంద్ర సంస్థలతో విచారణ లేదా రాష్ట్ర స్థాయిలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. 

అంగన్వాడీ వ్యవస్థపై ప్రభావం... 

ప్రస్తుత పరిణామానికి సంబంధించిన ప్రభావం నేరుగా అంగన్వాడీ వ్యవస్థపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ము ఖ్యంగా ఫీల్ స్థాయిలో పనిచేస్తున్న అంగన్వా డీ కార్యకర్తలు ఈ పరిణామాలతో అనిశ్చితిలో పడుతున్నారు. ప్రభుత్వం డిజిటల్ సే వలను మెరుగుపరచేందుకు ఈ ఫోన్లను అందించినప్పటికీ, వివాదం కారణంగా వాటి వినియోగం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ల నాణ్యత, నెట్‌వర్క్ సామర్థ్యం, యాప్‌ల పనితీరు వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారితే, ఫీల్డ్‌లో రోజువారీ పనులు ప్రభావితం కావ చ్చు.

ప్రత్యేకంగా పిల్లల పోషణ, గర్భిణీల ఆరోగ్య డేటా సేకరణలో అంతరాయం ఏర్పడే ప్ర మాదం ఉంది. రియల్‌టైం డేటా అప్లోడ్ ఆలస్యం కావడం, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు తలెత్తే అవకాశం, ఫీల్ స్థా యి నివేదికల ఖచ్చితత్వం దెబ్బతినే పరిస్థితి వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఈ వివాదం అంగన్వాడీ కార్యకర్తలపై మానసిక ఒత్తిడిని కూడా పెంచే అవకాశం ఉంది.

ఒకవైపు కొత్త పరికరాల వినియోగంపై స్పష్టత లేకపోవ డం, మరోవైపు రాజకీయ ఆరోపణల మధ్య తమ పనిని కొనసాగించాల్సిన పరిస్థితి వారికి సవాలుగా మారుతోంది. ఇక ప్రజలలో కూడా అనుమానాలు పెరుగుతున్నా యి. ప్రభుత్వ సేవలపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నా రు. ఈ పరిస్థితి స్పష్టతకు రావాలంటే త్వరితగతిన సమగ్ర విచారణ, స్పష్టమైన వివరణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

అసలు ఏం జరిగింది... 

అంగన్వాడీ సేవలను డిజిటల్ విధానంలో మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. పిల్లల పోషణ, గర్భిణీల ఆరోగ్య సమాచారం, ఫీల్ స్థాయి డేటా సేకరణను రియల్ టైంలో నిర్వహించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా భావించారు. ఈ క్రమంలో సుమారు రూ. 54 కోట్ల అంచనా వ్యయంతో వేలాది అంగన్వాడీ కార్యకర్తలకు ఫోన్లు అందించేందుకు టెండరును ఖరారు చేశారు.

టెండర్ ప్రక్రియలో సాంకేతిక ప్రమాణాలు నిర్ణయించి, బల్క్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా సంస్థలను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ పారదర్శకతపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్‌లో పోటీని పరిమితం చేసి కొందరు సరఫరాదారులకు అనుకూలంగా షరతులు మార్చారని, మార్కెట్ ధరల కంటే ఎక్కువకు ఫోన్లు కొనుగోలు చేశారని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.

ముఖ్యంగా రూ. 6,500-7,000 మధ్య లభించే ఫోన్లను రూ. 14,500కు కొనుగోలు చేశారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇక టెక్నికల్ అంశాల్లో కూడా లోపాలు ఉన్నాయని, 5జీ ఫోన్లు అందిస్తామని టెండర్‌లో పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా 4జీ పరికరాలనే పంపిణీ చేశారన్న బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. తమ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా టెండర్ డాక్యుమెంట్లు, కొనుగోలు ఆర్డర్లు, ఫోన్ మోడల్ నంబర్లు, టెక్నికల్ స్పెసిఫికేషన్లు, మార్కెట్ ధరలతో పోల్చడం వంటి పలు సాక్ష్యాలను బీఆర్‌ఎస్ నేతలు చూపుతున్నారు.

ముఖ్యంగా మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఫోన్లను ప్రభుత్వ కొనుగోలులో రెట్టింపు ధరకు చూపించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం టెండర్ ప్రక్రియను ప్రజలకు వెల్లడించాలి, సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలి, అవసరమైతే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.

ఈ ఆరోపణలు నిజమైతే టెండర్ షరతుల ఉల్లంఘన, సాంకేతిక ప్రమాణాల్లో మోసం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం అనే తీవ్రమైన ఆరోపణలకు దారితీసే అంశమని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఫోన్ ధరతో పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్, వారంటీ, మెయింటెనెన్స్, ట్రైనింగ్ వంటి అంశాలను కలిపి మొత్తం ప్యాకేజ్‌గా పరిగణనలోకి తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. 

టెండర్ ప్రక్రియపై తలెత్తుతున్న ప్రశ్నలు..

* టెండర్ ప్రక్రియ నిజంగా పారదర్శకంగా జరిగిందా? లేక కొంతమంది కంపెనీలకే అనుకూలంగా షరతులు రూపొందించారా?

* బిడ్ ప్రక్రియలో పోటీ సరైన స్థాయిలో జరిగిందా? లేక పోటీని పరిమితం చేశారా?

* మార్కెట్ ధరల కంటే ఎక్కువకు కొనుగోలు ఎందుకు జరిగింది? ధర నిర్ణయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు?

* టెండర్‌లో పేర్కొన్న సాంకేతిక ప్రమాణాలు (5జీ సపోర్ట్ వంటి అంశాలు) ఫీల్డ్లో ఇచ్చిన ఫోన్లలో నిజంగా అమలయ్యాయా?

* టెక్నికల్ ఎవాల్యూయేషన్, క్వాలిటీ చెక్ ప్రక్రియలు నిజంగా కచ్చితంగా జరిగాయా?

* సరఫరా చేసిన ఫోన్లపై స్వతంత్ర ఆడిట్ లేదా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ జరిగిందా?

* మొత్తం ప్రాజెక్ట్‌లో ఖర్చు చేసిన ప్రతి రూపాయి వినియోగంపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించారా?. ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు రాకపోవడం వల్లే వివాదం మరింత ముదురుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.