29 March, 2026 | 3:40 AM

మూసీ పేరిట లక్షన్నర కోట్ల అవినీతి

29-03-2026 01:49 AM

 ప్రజలను భయపెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి 

స్కాములు, అవినీతిపై ప్రశ్నిస్తే బెదిరింపులు

  1. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం పరిస్థితి
  2. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రాజెక్టు చేపట్టాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): మూసీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తాను అంటూ సీఎం మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని అన్నారు.

హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సీఎం, తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం 16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి, భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తుచేశారు.

అయినప్పటికీ ప్రస్తుత ప్రభు త్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం, అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంట ర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని అన్నారు. మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని, గాంధీ కుటుంబ సభ్యు లు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు.

అయినప్పటికీ ఇప్పుడు దేవుడి పేరు ను ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని, మూసీ ప్రాజెక్టును ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమ లు చేయాలని, లేదంటే లక్షలాది ఇళ్లను కూల్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి లాగా మారిందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  మూసీ ప్రాజెక్ట్ పై అసలు ప్రణాళికలు లేకుండా, డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరో పించారు.

బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తూ, పెద్దల ఇళ్లను వదిలేస్తున్నారని, ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్య త యువతపై ఉందని, మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తు తం వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయని, ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భావోద్వేగ అంశమని గుర్తుచేశారు.

రాబో యే కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ మెదటివారంలో మేధావులు, పర్యావరణ నిపుణుల తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఏప్రిల్ 14 వరకు ప్రతి కాలేజీ, ప్రతి బస్తీలో ప్రచారం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. వెంటనే తాళాలు తీసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేకపోతే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా వేలాది మందితో వెళ్లి తాళాలు బద్దలుకొట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు.

ఇళ్లను కూలుస్తూ, భూముల గుంజుకుంటే సహించం: సబితా ఇంద్రారెడ్డి 

45 ఏళ్ల నుంచి రంగారెడ్డి ప్రజల ఆశీర్వాదంతో తమ కుటుంబం సేవలు అందిస్తున్నదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘మాకు ఎన్నో పదవులిచ్చిన రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చడం మా బాధ్యత’ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ కుటుంబం తర్వాత నా కుటుంబంపైనే ప్రేమ ఎక్కువ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మూసీ పరివాహక ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను కూడా సీఎం లాక్కుంటూ ఉంటే, పేదల ఇళ్లను కూల్చుతుంటూ తమాషా చూస్తూ కూర్చుంటామా అని ప్రశ్నించారు.

రాజేంద్రనగర్ మా ప్రాంతం, అక్కడ నివసిస్తున్నది మా ప్రజలు అని, ఏదో సీఎం వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తే వణికిపోవడానికి ఎవరూ సిద్ధం లేరని హెచ్చరించారు. ప్రజా సమస్యల పట్ల కోర్టుకే కాదు.. ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. అందరి నోళ్ళు మూయించాలని ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి సైకలాజికల్‌గా అనుకుంటున్నారని, కానీ ఎవరు భయపడరని స్పష్టం చేశారు. మూసీకి మేం వ్యతిరేకం కాదని, అక్కడ జరిగే విధ్వంసానికి, లక్ష కోట్ల స్కాంకి వ్యతిరేకమని తెలిపారు. రేవంత్‌రెడ్డి అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. మమల్ని సామాజిక బహిష్కరణ చేస్తానని అంటున్నారని, కానీ రెండేళ్లు ఆగితే రాష్ట్రంలో వారినే బహిష్కరిస్తారని హెచ్చరించారు.