పొంగిన రెంకోనె వాగు... రాకపోకలు బంద్
మైనార్టీ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అవస్థలు.
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రెంకోనే వాగు ఉప్పొంగి తాత్కాలిక వంతెన తెగిపోవడంతో రాకపోకులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రంలో పట్టణ శివారున ప్రవహిస్తున్న రెంకోనే వాగు ఉప్పొంగింది. వాగు అవతల హైటెక్ సిటీ కాలనీ ఉండడం, అక్కడే మైనారిటీ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉండడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్థానికులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దశాబ్దాల నుంచి ఈ సమస్య తీరకుండా ఉండడంతో ప్రతి వర్షాకాలం ఈ తిప్పలు తప్పడం లేదు. ప్రతి ఏడూ వాగుపై తాత్కాలిక వంతెన నిర్మించడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. కాగా వాగు పై వంతెన నిర్మించాలని అనేకసార్లు మున్సిపాలిటీకి విన్నవించిన ఈ సమస్య తీరడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలకు ఈ వాగు ఉప్పొంగడంతో పాఠశాల ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా అవస్థలు ఎదుర్కొంటున్నారు. కాలనీవాసులు సైతం ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఇకనైనా అధికారులు ,నాయకులు పట్టించుకుని వంతెన నిర్మించి సమస్య తీర్చాలని పలువురు వేడుకుంటున్నారు.






