1 September, 2026 | 12:29 AM

బెంగళూరులో అద్దెల దరువు

09-06-2024 02:30 AM

ఇంటిని అద్దెకు తీసుకోవాలంటే 10 నెలల అడ్వాన్స్‌లు చెల్లించాల్సిందే

తెరపైకి జీరో డిపాజిట్ రెంటల్ స్కీమ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, జూన్ 8 (విజయక్రాంతి): దేశంలో పట్టణీకరణ క్రమంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే నగరాల్లో, పట్టణాల్లో ఇంటి అద్దెలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరులో ఇంటి అద్దెలు దరువేస్తున్నాయి. అక్కడ ప్రతినెల చెల్లించాల్సిన అద్దెలతో పాటు 10 నెలల రెంట్‌ను డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విధానాన్ని కట్టడి చేసేందుకు అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. 2024 జనవరి--మార్చిలో మళ్లీ రెంటల్ డిపాజిట్లు భారీగానే పెరిగినట్లు ఐటీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుతం 20 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో తాజాగా బెంగళూరులో జీరో డిపాజిట్ రెంటల్ స్కీమ్ మరోసారి తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ విధానాన్ని 2022 చివర్లోనే బ్రోకర్ డాట్ కామ్ ప్రవేశపెట్టింది. ఇది అధిక అద్దె కలిగిన 2, 3, 4 బీహెచ్‌కే ప్రాపర్టీలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో 2022తో పోలిస్తే 2023లో 400 శాతం మేర వృద్ధి సాధించింది. 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ప్రొఫెషనల్స్ దీనిని ఎంచుకుంటున్నారు. 

6 శాతం చెల్లిస్తే చాలు..

జీరో డిపాజిట్ రెంటల్  స్కీమ్‌లో ఏడాది అద్దె మొత్తంలో 6 శాతం చెల్లిస్తే చాలు. ఉదాహరణకు ఓ ఇంటి అద్దె నెలకు రూ.25వేలు ఉందనుకుంటే ప్రస్తుతం పది నెలల మొత్తం  రూ.2.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వాలి. అదే జీరో డిపాజిట్ రెంటల్ స్కీమ్ కింద రూ.18వేలు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు మూడేళ్లుగా చర్చలు సాగుతున్నా కర్ణాటక మోడల్ టెనెన్సీ చట్టంలో మార్పులు చేర్పులు ఇంకా కొలిక్కి రాలేదు.

ఇది అమల్లోకి వస్తే ఇంటి యజమాని అద్దెదారు నుంచి రెండు నెలల అద్దె మాత్రమే డిపాజిట్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఆ అద్దె డిపాజిట్‌ను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకుని 3 నుంచి 6 శాతం వడ్డీ పొందుతున్నట్లు తెలుస్తుంది. అయితే తమ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజీ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఇంటి యజమానులు ప్రశ్నిస్తున్నారు. తాము నష్టపోకుండా ఉండటానికే ముందస్తుగా 10 నెలల రెంటల్ డిపాజిట్‌గా తీసుకుంటున్నట్లు ఇంటి యజమానులు పేర్కొంటున్నారు. 

ఢిల్లీలో మూడు నెలలే..

ఢిల్లీలో రెండు నుంచి మూడు నెలల అద్దె మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకుంటారు. బెంగళూరులో మాత్రం తక్కువలో తక్కువ 6 నెలల నుంచి 10 నెలల అడ్వాన్స్ తీసుకుంటుండటం తో కొత్తగా ఐటీ ఉద్యోగంలో చేరిన వారికి తిప్పలు తప్పడం లేదు. జీరో రెంటల్ డిపాజిట్ స్కీమ్ అమల్లోకి వస్తే చాలామంది ఐటీ నిపుణులకు ఉపయోగకరంగా ఉంటుందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేర్కొన్నారు.

అందుబాటులో అద్దె, తక్కువ డిపాజిట్‌తో కూడిన ఇల్లు అద్దెకు దొరకడం బెంగళూరులో పెద్ద సవాల్‌గా మారిందని అక్కడ జాబ్  చేస్తున్న ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే బెంగళూరులో ఉన్న డిమాండ్ నేపథ్యంలో తక్కువ అద్దె డిపాజిట్, జీరో రెంటల్ డిపాజిట్ అనేది వర్కవుట్ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.