ఏపీలో బాబు వచ్చినా.. హైదరాబాద్ బ్రాండ్ తగ్గేదేలే!
గతంలోనూ తప్పుడు ప్రచారం
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 8 (విజయక్రాంతి): అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్ రియాల్టీకి నష్టం తప్పదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ రియాల్టీ కుప్ప కూలుతుందని, ఇందులో భాగంగానే గత ఏడెనిమిది నెలలుగా అమ్మకాలు పూర్తిగా తగ్గాయని మరికొందరు ప్రచారం చేస్తున్నారు.
కానీ ఎన్నికల కారణంగా గత ఏడెనిమిది నెలలుగా హైదరాబాద్ రియాల్టీ తగ్గిన మాట వాస్తవమే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొంత వరకు తగ్గాయి. కానీ ఇది తాత్కాలికమే అని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌తోపాటు వేసవి సెలవులు, జూన్‌లోనే స్కూల్స్ రీ ఓపెన్ వంటి అంశాలు రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ దీనిని ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం చంద్రబాబు రావడం వల్లే హైదరాబాద్ రియాల్టీ గ్రోత్ తగ్గుతోందని తప్పుడు ప్రచారం చేయడంలో అర్థం లేదని రియల్ రిపుణులు పేర్కొంటున్నారు.
గతంలోనూ ఇలాంటి ప్రచారమే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో ఏపీలో చంద్రబాబు, తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రులయ్యారు. అయితే ఆ సమయంలో హైదరాబాద్ రియాల్టీ ఢమాల్ అంటూ సీమాంధ్ర మీడియా చేయని ప్రచారం లేదు. హైదరాబాద్ పని అయిపోయిందని, అమరావతి అభివృద్ధి చెందుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ తర్వాత ఏమి జరిగింది అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప విజన్‌తో చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ విధానాలతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణతో హైదరాబాద్ రియాల్టీ దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోటీ పడటంతోపాటు దేశంలోనే ది బెస్ట్ లీవబుల్ సిటీగా కీర్తి పొందింది.
దీంతో అనేక మంది బిలియనీర్లు, ఎన్నారైలు, వ్యాపారస్థులు హైదరాబాద్‌లో ఒక ప్లాట్ ఉంటే చాలు అనుకునే స్థితికి వచ్చారు. వాస్తవానికి హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళిక నిజాం నాటి నుంచి ఉంది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ కేంద్రంగా మాత్రమే అభివృద్ధి జరిగింది. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి వికేంద్రీకరణతో హైదరాబాద్ నలుదిక్కులా అభివృద్ధి పరుగులు పెట్టింది. దీంతో హైదరాబాద్ రియాల్టీ కేవలం 10 ఏండ్లలోనే పదింతలు పెరిగింది.
అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్
హైదరాబాద్ సిటీ ఇప్పటికే మెట్రో నగరంగా అభివృద్ధి చెందిన నగరం. మౌలిక వసతుల కల్పన, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలతోపాటు ప్రపంచస్థాయి శాంతిభద్రతలకు హైదరాబాద్ నెలవు. హైదరాబాద్‌లో భారీ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ పరిశ్రమలు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ వంటి బృహత్తర అభివృద్ధితో నగరం ఇప్పటికే ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది.
వాతావరణం పరంగా హైదరాబాద్ దక్కన్ పీఠభూమిలో ఉన్న ప్రాంతం కాబట్టి ప్రకృతి విపత్తులు కూడా తక్కువగా ఉంటాయి. సాధారణంగా అభివృద్ధితోపాటు శాంతిభద్రతలు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్న చోట మాత్రమే రియాల్టర్లు పెట్టుబడి పెడుతారు. హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితి అమరావతిలో లేదు కాబట్టి ఇక్కడ రియాల్టీకి ఇప్పుడే కాదు మరో 100 ఏండ్లు దాటినా, ఎంత మంది చంద్రబాబులు వచ్చినా హైదరాబాద్ రియాల్టీకి ఇబ్బంది ఉండదని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.






