కౌన్సిలర్ గారూ.. మా వార్డు వైపు చూడరా!
మీ వార్డు లో సమస్యలు ఉన్నాయి అవి తీర్చాలంటే వెళ్లి డబ్బులు తీసుకుని రండి డబ్బులు కావాలా లేక అభివృద్ధి కావాలా అని అడిగినప్పుడు డబ్బులు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నప్పుడు నేను ఎందుకు ఫ్రీ గా మీకు సేవలు చేయాలా అని ఓ సినిమా లో రాజకీయ నాయకుడి ప్రజల మధ్యలో జరిగిన సంభాషణ. డబ్బులు తీసుకుని నాకు ఓట్లు వేశారు ఫ్రీ గా వేయనప్పుడు వార్డు లో చిన్న చిన్న పనుల గురుంచి నాకు ఎందుకు చెబుతున్నారు నాకు సంబంధం లేదని ఓ అధికార పార్టీ కౌన్సిలర్ చెబుతున్నారని స్థానిక వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు.
- సిసి, డ్రైనేజీలను జర పట్టించుకోండి..
- నాకు ఎందుకు చెబుతున్నారు? చేసుకోండి
- నాకేమైనా డబ్బులు లేకుండా ఓట్లు వేసారా? డబ్బులు తీసుకున్నారు కదా
- అధికార పార్టీ కౌన్సిలర్ జవాబుకు ఖంగుతింటున్న వార్డు ప్రజలు
వనపర్తి, జులై 23 ( విజయక్రాంతి ): ప్రజలు ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి పునాది. గెలిచిన ప్రజాప్రతినిధి ప్రజల సమస్యలను పరిష్కరించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత. కానీ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఓ అధికార పార్టీ కౌన్సిలర్ నుంచి వచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు వార్డులో తీవ్ర చర్చకు దారితీశాయి. సీసీ రోడ్లు లేవు... డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయి... వర్షం వస్తే వీధులు చెరువుల్లా మారుతున్నాయి... ఈ సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్ను కోరితే, ‘డబ్బులు తీసుకుని ఓట్లు వేశారు కదా... ఇప్పుడు నాకు ఎందుకు చెబుతున్నారు? నేను ఫ్రీగా సేవలు చేయాలా?‘ అంటూ సమాధానం ఇచ్చినట్లు వార్డు ప్రజలు చెబుతున్నారు.
గెలువక ముందు..... గెలిచిన తరువాత..
సాధారణంగా మున్సిపాలిటీ ఎన్నికల పరిధిలో ఆయా వార్డు లో నిలబడే వ్యక్తులు ఎన్నికల నిబంధనల ప్రకారంగా వాహనాల ఖర్చు, కరపత్రాలు, భోజనం, ఇలా ఎన్నికల్లో లక్ష లోపు మాత్రమే ఖర్చు పెట్టాలని అందుకే సంబందించి ఖర్చు లెక్కలు లక్ష లోపు సమర్పించాలి ఇచ్చిన లెక్కలు కరెక్ట్ కాదా అనేది సంబందించిన అధికారులు పర్యవేక్షణ చేయాలి. కానీ ఎన్నికల నిబంధన ప్రకారంగా ప్రతి వార్డు లో లక్ష లోపు ఖర్చు ఖర్చు చూయించారు తప్ప లక్షల్లో ఖర్చు పెట్టిన సంగతి అటు అధికారులకు ఇటు ప్రజలకు సైతం తెలిసిందే.
ఎన్నికల ప్రచార సమయంలో ప్రతి ఇంటికి వచ్చి మీకు ఏ సమస్య వచ్చిన నేరుగా తమకు చెప్పాలని వాటిని సంబందించిన అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయించే బాధ్యత నాదని చెప్పి ఓట్లు అడిగి ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటి వరకు బాగానే ఉంది కష్టపడి గెలిపించుకున్నాం మా పనులు వార్డు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని భావించిన ప్రజలకు తీర గెలిచిన తర్వాత పట్టణంలోని ఓ వార్డుకు చెందిన కౌన్సిలర్ దగ్గరికి తమ వార్డులో పలు సమస్యలు ఉన్నాయని ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉందని వాటి పరిష్కార దిశగా చేయాలని కౌన్సిలర్ దగ్గరికి వెళ్లిన ప్రజలకి కౌన్సిలర్ దగ్గర నుంచి వచ్చిన సమాధానం అందరిని అయోమయంలో పడేసిందని వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు.
మీరు నాకు ఏమైనా ఫ్రీగా ఓటేశారా డబ్బులు తీసుకున్నారు కదా డ్రైనేజీ వంటి వ్యవస్థల పనులు నాకెందుకు చెప్తున్నారు అంటూ ఇచ్చిన సమాధానం ఓ సినిమాలోని ఓ రాజకీయ నాయకుడు ప్రజలకు ఇచ్చిన సమాధానం మాదిరిగా ఉందని ప్రజలు బాహాటంగా పెదవి విరుస్తున్నారు. ప్రజలు అడిగేది వ్యక్తిగత సహాయం కాదు. తమ పన్నుల డబ్బుతో రావాల్సిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు వంటి కనీస సౌకర్యాలే. వాటిని కోరితే ఇలాంటి సమాధానాలు వస్తే ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వార్డు వాసులు ప్రశ్నిస్తున్నారు.
కౌన్సిలర్ మాటలకు పరిష్కారం దొరుకుతుందా..
ప్రస్తుతం ఈ వ్యవహారం వార్డులో, వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో హాట్ టాపిక్గా మారింది. కౌన్సిలర్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకత్వం స్పందిస్తుందా? ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతుందా? లేక ఈ వివాదాన్ని కూడా కాలగర్భంలో కలిపేస్తుందా? అనే చర్చ సాగుతోంది.
కౌన్సిలర్ సమాధానం.. డబ్బులు తీసుకున్న ఓటరుకు చెంపపెట్టు..
ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నుండి కాకుండా స్వతంత్ర అభ్యర్థులు గా నిలబడి పేద ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన నాయకుల దగ్గర ఆ నాయకుడు అంత ఇస్తున్నాడు మీరు ఎంత ఇస్తారన్న ప్రశ్నలు ప్రజలు బహిరంగంగానే అభ్యర్థులను అడిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రజల వద్దకు ఎన్నికల సమయంలో వచ్చిన నాయకుడి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా ఓటు వేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఎన్నికల సమయంలో అధికారులు తమ ఓటు ను నోటు కు అమ్ముకోవద్దని పలు మార్లు చెప్పిన అవగాహన కల్పించిన మంచి మాటలను పెడ చెవిన పెట్టి ఓట్లు నోటుకు అమ్ముకునే వాళ్లకు కౌన్సిలర్ చెప్పిన సమాధానం కరెక్ట్ గా ఉందని డబ్బులు ఎవరికి ఉరికనే రావు అన్న యాడ్ ను గుర్తు చేస్తూ విద్యావంతులు చెబుతున్నారు






