అనుమానాస్పదస్థితిలో దంపతుల మృతి
- పీరీల పూజల అనంతరం ఇంటి వరండాలో మృతదేహాలు
- హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపణ
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 18 (విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలం కోసార గ్రామపంచాయతీ పరిధిలోని భవానీనగర్ గ్రామంలో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన బానోత్ రాజు (47), బానోత్ సుశీల (43) దంపతులు మృతిచెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రాజుసుశీల దంపతులు ఇటీవల గ్రామంలో కొత్త పీరీలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బుధవారం రాత్రి ఇంటి ఆవరణలోని వరండాలో నిద్రించారు. గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు వారిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు గుర్తించారు.దంపతులిద్దరిని నిద్రలోనే గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామంలో పీరీల వ్యవహారంపై రెండు వర్గాల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయని, ఆ అంశం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో పీరీల పూజలు నిర్వహించిన అనంతరం దంపతులు మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం వైద్యుల సూచన మేరకు ఫోరెన్సిక్ పరీక్షల కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.






