సెల్యూట్ పోలీస్
నిరంతర ప్రత్యేక పర్యవేక్షణ
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పలువురు నేతలపై కోడ్ ఉల్లంఘన కేసులు
మూడు కమిషనరేట్ల పరిధిలో 81 కేసులు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగరంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న గొడవలు మినహాయిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన పాతబస్తీలో ఈ సారి ఎన్నికల పోరు వాడివేడిగా సాగింది. ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లుగా ప్రచారం కొనసాగించారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు ఎలాంటి గొడవలు, అల్లర్లు జరగకుండా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వ్యూహాత్మకంగా పనిచేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి కమండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్‌జోషిలు అనునిత్యం ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు అనుగుణంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లారు.
తమ కమిషనరేట్ పరిధిలోని సిబ్బందిని అనునిత్యం అప్రమత్తం చేస్తూ, పకడ్భందీగా తనిఖీలు నిర్వహిస్తూ భారీ మొత్తంలో అక్రమ నగదు, మద్యాన్ని పట్టుకున్నారు. అలాగే రాజకీయ పార్టీ నాయకుల మీటింగ్‌లు, రోడ్‌షోలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నేతలకు హెచ్చరించారు. రాజకీయ పార్టీలు నిర్వహించే క్రార్యక్రమాలకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసే వరకు మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు నిరంతరం శ్రమించారు.
నిఘూ నీడలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్లలో సుమారు 30,500 మంది కేంద్ర, రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పలువురు రాజకీయ నేతలపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 47 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.




